ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Sep 06, 2020 , 02:35:35

పగలు సేకరణ.. రాత్రి రవాణా

పగలు సేకరణ.. రాత్రి రవాణా

  • n రేషన్‌ బియ్యాన్ని పక్క రాష్ర్టాలకు తరలిస్తున్న అక్రమార్కులు
  • n జిల్లాలో ఇప్పటి వరకు 54 కేసులు నమోదు  n రూ. 17.38 లక్షల విలువైన బియ్యం పట్టివేత

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల జిల్లాలో పీడీఎస్‌ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడుస్తున్నది. కరోనా వైరస్‌ అక్రమార్కులకు మరింత లాభం చేకూర్చుతున్నది. బియ్యం అక్ర మ వ్యాపారం చేసే వ్యక్తులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 423 రేషన్‌ దుకాణాల ద్వారా 2,14,284 కార్డుల పరిధిలో 6,40,185 యూనిట్లకు పది కిలోల చొప్పున బియ్యం పంపిణీ అవుతున్నది. ఇందులో 15,418 ఏఎఫ్‌ఎస్‌సీ కార్డుల కింద 47,417 యూనిట్లుండగా.. 1,98,292 కార్డుల కింద 5,92,597 యూని ట్లు, 170 ఏఏవై కార్డుల కింద 171 యూనిట్ల చొప్పున మొత్తం 61,32,951 కిలోలు ఉచితంగా రేషన్‌ బియ్యం అందజేస్తున్నారు. ఈ బియ్యాన్ని కొంత మంది బ్రోకర్లు, మిల్లర్లు కలిసి రీ సైక్లింగ్‌ చేసి యథేచ్ఛగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

పగలంతా సేకరణ..

రేషన్‌ దుకాణాల్లో ఈ పాస్‌ మిషన్లు రాక ముందు నేరుగా డీలర్ల నుంచే నేరుగా సబ్సిడీ బియ్యం మిల్లులకు చేరేది. మిషన్లు వచ్చాక రేషన్‌ డీలర్లు బయోమెట్రిక్‌ ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులు తీసుకెళ్లిన బియ్యాన్ని సేకరించేందుకు జిల్లాలో పలు ప్రాం తాల్లో బృందాలుగా ఏర్పడి సేకరిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోల్లో  మిల్లులకు తరలించి రీసైక్లింగ్‌ చేసి తిరిగి సంచుల్లో నింపుతుంటారు. అనంతరం రాత్రికి రాత్రే లారీల్లో లోడ్‌చేసి జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అక్కడ మిల్లర్లు కిలో బియ్యాన్ని రూ.18కి విక్రయిస్తున్నారు. ఒక లారీలో 200 క్వింటాళ్ల బియ్యం తరలిస్తే అక్రమార్కులు ఒక లారీకి రూ.2 లక్షల లాభం ఆర్జిస్తున్నారు. కరోనా కారణంగా లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం లేదు. వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వేలిముద్రలు వేసి కార్డుదారులకు రావాల్సిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ నెలాఖరు వరకు బియ్యంతీసుకోని లబ్ధిదారులకు సంబంధించి డీలర్లు ఉద్యోగుల ద్వారా తీసుకొని ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

ఈ ఏడాది 6ఏ కేసులు 54..

 ఈ ఏడాది జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 6ఏ కేసులు 54 నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడిన 13 రేషన్‌ దుకాణాలను సీజ్‌ చేయడంతో పాటు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న 31 వాహనాలను సీజ్‌ చేశారు. 1629 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. 2016 నుంచి ఇప్పటివరకు  రూ. 17.38 లక్షల విలువైన రేషన్‌ బియ్యం, రూ. 16.20 లక్షల విలువైన వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు పోలీస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులు జంకడం లేదు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో వారు జరిమానా లు కట్టి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నారు. 

ప్రతిరోజూ దాడులు నిర్వహిస్తున్నాం..

   పేదలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే సహించేది లేదు. ప్రతిరోజూ దాడులు నిర్వహిస్తున్నాం. ఎలాంటి తప్పిదాలు జరిగినా రేషన్‌ దుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నాం. డీటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 54 కేసులు నమోదు చేశాం. 31 వాహనాలను సీజ్‌ చేశాం. అక్రమార్కులపై జరిమానా విధిస్తున్నాం. 

   - వీ వెంకటేశ్వర్లు,  జిల్లా పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల


logo