శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Sep 03, 2020 , 01:46:07

అనుమతి లేకుండానే కరోనాకు చికిత్స

అనుమతి లేకుండానే కరోనాకు చికిత్స

  • n దిక్కుతోచని స్థితిలో రోడ్డునపడ్డ బాధితులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మందమర్రి ఒకటోజోన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీం తో చికిత్స చేస్తానంటూ మున్సిపాలిటీ సమీపంలోని ఓ ప్రైవేట్‌ దవాఖాన.. రోగికి నమ్మబలికింది. ఇందుకు రోజు రూ.30 వే లు ఖర్చవుతాయంటూ ఒప్పందం చేసుకున్నది. వాస్తవానికి ఆ బాధితుడిని గురువారం డిశ్చార్జి చేయాల్సి ఉండగా, అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ మంగళవారమే హడావుడిగా పంపించింది. అతనితో పాటు సుమారు పదిమంది రోగులను పంపించేయడంతో దిక్కుతోచని స్థితిలో నానా అవస్థలు పడ్డారు. కొందరు వేరే దవాఖానకు వెళ్లగా, మరికొందరు ఇంటికి పోయారు. ఈ పరిస్థితి కేవలం ఆ ఒక్క దవాఖానలోనే కాదు.. జిల్లా కేంద్రంలోని నాలుగైదు ఆసుపత్రుల్లో కొ విడ్‌ చికిత్స పేరుతో ప్రజలను నిలువెల్లా దోపిడీ చేస్తున్నారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రైవేట్‌ దవాఖానలు దోపిడీకి తెరతీశాయి. చికిత్స అందిస్తామంటూ బాధితులకు మాయమాటలు చెప్పి, వారి నుంచి లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. అనుమతులు లేకుండా వైద్యం చేయవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 

జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి..

జిల్లా కేంద్రంలోని సుమారు ఏడు దవాఖానల్లో కరోనాకు చికిత్స చేస్తున్నారు. కేవలం శ్రీరక్ష ఆసుపత్రికి మినహా ఏ దవాఖానకు అనుమతి లేదు. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకుండానే మమ అనిపించడం దారుణమైన విషయం.

బయటకు గెంటేసిన దవాఖాన..

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఓ ప్రైవేటు దవాఖానలో కొద్ది రోజులుగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్కో రోగికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఇంజిక్షన్లను బ్లాక్‌లో తెప్పిస్తున్నామంటూ అధిక ధరలు వసూలు చేస్తుండడం గమనార్హం. తాజాగా మంగళవారం అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ హడావుడిగా రోగులను ఖాళీ చేయించారు. తామెక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తే.. ఇక్కడేం మాట్లాడవద్దు వెళ్లిపోండని హుకూం జారీ చేశారు. దీంతో బాధితులు కొందరు వేరే దవాఖానకు వెళ్లగా, మరికొందరు ఇంటికి వెళ్లిపోయారు. అయితే దవాఖాన వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. తమకు చికిత్స అందించిన కే-షీట్‌ సైతం ఇవ్వకుండా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.