బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Sep 03, 2020 , 01:46:08

ఆసిఫాబాద్‌లో పోలీస్‌ బాస్‌ పర్యటన

ఆసిఫాబాద్‌లో పోలీస్‌ బాస్‌ పర్యటన

 కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో బుధవారం డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. తిర్యాణి అడవుల్లో ఇటీవల మావోయిస్ట్‌ నేత అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తన బృందంతో సంచరించారని సమాచారం అందడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులు అడవులను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో రెండు సార్లు ఎదురుపడినా తృటిలో తప్పించుకున్నారు. జూలై 17న డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లాలో పర్యటించారు. కూంబింగ్‌లో భాగంగా లభించిన డంప్‌లో భాస్కర్‌కు సంబంధించిన డైరీ లభ్యం కావడంతో, మావోయిస్టులకు సహకరిస్తున్న కొంత మంది పేర్లు బయటపడ్డాయి. దీంతో వీరికి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌ చేరుకున్న మహేందర్‌ రెడ్డి కొద్దిసేపు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, రామగుండం సీపీ, ఆసిఫాబాద్‌ ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ, ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణువారియర్‌, ఆసిఫాబాద్‌ ఏఎస్పీ సుధీంద్రతో జిల్లాలో మావోయిస్టుల  కదలికలపై చర్చించారు. అనంతరం జిల్లాలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తిర్యాణి అడవులతో పాటు మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ప్రాణహిత పరీవాహక ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లాలోనే డీజీపీ బస చేయనున్నారు.

డీజీపీ ఏరియల్‌ సర్వే

ఉట్నూర్‌ : మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి హెలికాప్టర్‌లో ఉట్నూర్‌లోని కుమ్రంభీం ప్రాంగణానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌, ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డిని ఎక్కించుకొని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, దండేపల్లి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించినట్లు సమాచారం.


logo