సోమవారం 26 అక్టోబర్ 2020
Mancherial - Sep 03, 2020 , 01:46:09

కూలిన గని పైకప్పు

కూలిన గని పైకప్పు

  • n శ్రీరాంపూర్‌ ఆర్‌కే-5బీలో ప్రమాదం
  • n ఒకరి మృతి.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
  • n క్షతగాత్రులను పరామర్శించిన  టీబీజీకేఎస్‌ నాయకులు

మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌) : శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే-5బీ గనిలో బుధవారం రెండో బదిలీలో రాత్రి 7 గంటలకు గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. బదిలీ ఇన్‌చార్జి ఓవర్‌మెన్‌ రమేశ్‌రాజు ఆదేశం మేరకు ప్యానల్‌ ఇన్‌చార్జి ఇజగిరి శివయ్య షాట్‌ఫైరర్‌ కట్ల శ్రీకాంత్‌ పర్యవేక్షణలో డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ పనులు చేస్తున్నారు. ఆర్కే- 5బీ గనిలోని నాలుగో సీమ్‌లోని జీఎస్‌ 23వ ప్యానల్‌, 36 ఆఫ్‌ లెవల్‌, 2వ డీప్‌ ఆఫ్‌ లెవల్‌ పని స్థలంలో గనిపై కప్పునకు కోల్‌కట్‌ డ్రిల్లింగ్‌ పనులు చేస్తున్నారు. పాత మందు గుండు మిగిలి ఉన్నదానికి ఢీకొనడంతో   ఒక్క సారిగా పేలి గనిపై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో కోల్‌కట్టర్లు  గాదె శివయ్య, పల్లె రాజయ్య, చిలుక సుమన్‌, రత్నం లింగయ్యపై గని పైకప్పు కూలింది. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. రత్నం లింగయ్య(50)ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. అతడు మందిమర్రిలో నివాసం ఉంటున్నాడు. కొద్ది దూరంలో ఉన్న షాట్‌ఫైరర్‌ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలు కాగా, రామకృష్ణాపూర్‌ ఏరియా దవాఖానకు తరలించారు.  మిగతా వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.  

టీబీజీకేఎస్‌ నాయకుల పరామర్శ  

గని ప్రమాదంపై టీబీజీకేఎస్‌ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఏరియా దవాఖానలో బాధిత కార్మికులను టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవిందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, నస్పూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ తోట శ్రీనివాస్‌, పిట్‌ కార్యదర్శులు సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నీలం సదయ్య పరామర్శించారు. యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ, రక్షణ చర్యలు చేపట్టడంలో చూపించడం లేదని ఆరోపించారు. ప్రమాదం జరిగితే గుర్తింపు కార్మిక సంఘానికి సమాచారం ఇవ్వకుండా బాధితులను దవాఖానకు తరలించడాన్ని సురేందర్‌ రెడ్డి ఖండించారు.  కార్మికులకు కార్పొరేట్‌ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించాని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట టీబీజీకేఎస్‌ నాయకుడు తాటి బాపు ఉన్నారు.


logo