ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 31, 2020 , 00:18:07

సత్ఫలితాలనిస్తున్న ‘దోస్త్‌' హెల్ప్‌డెస్క్‌లు

సత్ఫలితాలనిస్తున్న ‘దోస్త్‌' హెల్ప్‌డెస్క్‌లు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : 2020-21 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరబోయే విద్యార్థినీ విద్యార్థులకు దోస్త్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పరిష్కరించేందుకు డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలు (హెచ్‌సీఎల్‌) సత్ఫలితాలనిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్‌, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ఈ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ హెల్ప్‌డెస్క్‌ల్లో ఉచితంగా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. మరోవైపు మొదటి విడుత వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో హెల్ప్‌డెస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. మొబైల్‌ ద్వారా ఇంటి నుంచి దోస్త్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ సమయంలో ఎలాంటి సందేహాలున్నా వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మంచిర్యాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో కో ఆర్డినేటర్లుగా డీ రామకృష్ణ (94404 18423), జే మహేశ్‌కుమార్‌ (94943 62949) అందుబాటులో ఉంటున్నారు. 

ఉచితంగా సేవలు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉచితంగా ఈ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా సేవలందిస్తున్నారు. ప్రతి హెల్ప్‌డెస్క్‌లో రెండు కంప్యూటర్ల ద్వారా విద్యార్థుల నుంచి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో విద్యార్థులు చేరదలుచుకున్న కళాశాల, సబ్జెక్టును ఆన్‌లైన్‌ ద్వారా ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 


logo