ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 30, 2020 , 02:24:55

మంచిర్యాల జిల్లాలో నిండుగా జలాశయాలు

మంచిర్యాల జిల్లాలో నిండుగా జలాశయాలు

  • n ‘మిషన్‌ కాకతీయ’తో పూర్వ వైభవం
  • n 890 జలవనరుల్లో 4.96 టీఎంసీల నీరు నిల్వ
  • n సాగుకు 3.50 టీఎంసీలు వినియోగించుకునే వీలు
  • n ఆయకట్టు రైతులకు భరోసా
  • n ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు దీవెనలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సీమాంధ్ర పాలకుల పట్టింపులేని తనంతో నీరసించి పోయిన చెరువులు, నేడు తెలంగాణ సర్కారు చొరవతో పునర్జీవం పోసుకున్నాయి. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడుతల్లో చెరువులకు మరమ్మతులు చేయగా, నిండుకుండల్లా మారి జలకళను సంతరించుకున్నాయి. గతంలో చిన్నపాటి వర్షాలకే కట్టలు తెగిపోయి నీరు నిల్వకు పంటలు పండేవి కావు. దీంతో యేటా చెరువుల కింద ఉన్న భూములన్నీ బీళ్లుగా ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడంతో పుష్కలంగా నీరు ఉంటుంది. ఆయా చెరువుల కింద యేటా రెండు పంటలు పండించుకుంటున్నారు. 

మిషన్‌ కాకతీయతో మారిన రూపురేఖలు..

జిల్లాలో మొత్తం 890 చెరువులు ఉన్నాయి. వీటిల్లో చిన్న నీటి వనరుల కింద 123 చెరువులు, పంచాయతీ రాజ్‌ కుంటలు 767 ఉన్నాయి. వీటిల్లో మిషన్‌ కాకతీయ ద్వారా మొదటి విడుతలో రూ.37.21 కోట్లతో 147 చెరువులను పునరుద్ధరించింది. ఆయా చెరువుల కింద 11,542 ఎకరాలు సాగవుతున్నాయి. రెండో విడుతలో రూ. రూ.54.84 కోట్లతో 152 చెరువులకు మరమ్మతులు చేశారు. మరో 6 చెరువులు మరమ్మతు దశలో ఉన్నాయి. 15,253 ఎకరాలు సాగవుతున్నాయి. మూడో విడుతలో 109 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.34.02 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వీటిల్లో 109 పనులకు టెండర్లు పిలిచారు. ఇందులో 81 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా 9,908 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. నాలుగో విడుతలో 61 చెరువులను మరమ్మతులు చేయాలని నిర్ణయించగా, ఇందులో 60 పనులకు టెండర్లు పిలిచారు. ఒక పనిని రద్దు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ. 19.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వీటిల్లో 36 పనులు పూర్తి చేశారు. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఈ చెరువుల కింద 7,353 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. 

చెరువుల్లో 4.96 టీఎంసీల నీరు..

జిల్లా వ్యాప్తంగా 890 చెరువులు ఉండగా, ఇందులో 4.96 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో దాదాపు 3.50 టీఎంసీల వరకు నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. 890 చెరువుల కింద 63,496 ఎకరాల ఆయకట్టు ఉండగా, పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ చెరువుల కింద పట్టుమని పదివేల ఎకరాలు కూడా సాగు చేయలేని దుస్థితి ఉండేది. ప్రస్తుతం సుమారు 60 వేల ఎకరాలు సాగులోకి రావడం సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్‌ చొరవవల్లే ఇది సాధ్యమైందని, ఆయన సల్లంగుండాలని రైతులు దీవిస్తున్నారు.


logo