శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 30, 2020 , 02:25:23

పల్లె వాకిట ప్రకృతి వనం

పల్లె వాకిట  ప్రకృతి వనం

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,778 చోట్ల వనాలు

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా.. మరో 1,950 అనుబంధ గ్రామాలున్నాయి. గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 1,508 జీపీలతోపాటు 270 అనుబంధ గ్రామాల్లో పనులు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,778 పల్లెల్లో వనాలు ఏర్పాటు చేస్తుండగా.. భూములను కూడా ఎంపిక చేశారు. ఇప్పటివరకు 1,246 జీపీల్లో పనులు చేపట్టారు. భూములను చదును చేయడం, వాకింగ్‌ కోసం రోడ్ల నిర్మాణం చేపట్టడం, వివిధ రకాల మొక్కలను కూడా నాటుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 955 వనాల్లో 17,95,825 మొక్కలు నాటారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 323 ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా పూర్తయింది.

శరవేగంగా పనులు

పల్లె ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తుండగా.. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులను కేటాయిస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజలు వాకింగ్‌ చేసేందుకు ట్రాక్‌ నిర్మిస్తున్నారు. చల్లగా ఉండేందుకు మొక్కలు పెంచుతుండగా.. సేద తీరేందుకు చెట్ల కింద ప్లాట్‌ ఫాంలు ఏర్పాటు చేస్తున్నారు. పార్కు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో 459 చోట్ల పార్కులు ఏర్పాటు చేస్తుండగా.. అన్ని చోట్ల భూముల గుర్తించి పనులు చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 365 చోట్ల ఏర్పాటు చేస్తుండగా.. 329 చోట్ల భూములు చదును చేస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో 352 చోట్ల ఏర్పాటు చేస్తుండగా.. 221 చోట్ల భూములు చదును చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో 602 చోట్ల ఏర్పాటు చేస్తుండగా.. 237 చోట్ల పార్కుల పనులు జరుగుతున్నాయి.

డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌ శాఖలకు నిర్మాణ పనులు అప్పగింత

మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలో 235 చోట్ల 8,27,785 మొక్కలు, మంచిర్యాల జిల్లాలో 104 చోట్ల 1,43,070, నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 443 చోట్ల 6,59,340, ఆసిఫాబాద్‌ జిల్లాలో 173 చోట్ల 1,65,630 మొక్కలు నాటారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో 25, మంచిర్యాల జిల్లాలో 26, నిర్మల్‌ జిల్లాలో 270, ఆసిఫాబాద్‌ జిల్లాలో 2 వనాల్లో మొక్కలు నాటడం పూర్తయింది. గ్రామీణాభివృద్ధిశాఖతోపాటు పంచాయతీరాజ్‌శాఖకు కూడా ప్రకృతి వనాల నిర్మాణం అప్పగించారని నిర్మల్‌ డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు ‘నమస్తే’తో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలతోపాటు అనుబంధ గ్రామాల్లోనూ ఈ వనాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిర్మల్‌ జిల్లాలో 459 చోట్ల ఏర్పాటు చేస్తుండగా.. అన్ని చోట్ల పనులు ప్రారంభించామన్నారు. 443 చోట్ల మొక్కలు నాటుతుండగా.. 270 చోట్ల నాటడం పూర్తయిందన్నారు.


logo