సోమవారం 26 అక్టోబర్ 2020
Mancherial - Aug 29, 2020 , 02:24:15

రైతుల జీవితాల్లో స్వర్ణకాంతులు

రైతుల జీవితాల్లో  స్వర్ణకాంతులు

  • n నాలుగేండ్లుగా వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా నీరు
  • n ఆరు గ్రామాల్లో పెరిగిన భూగర్భజలాలు.. సాగు విస్తీర్ణం..
  • n ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న అన్నదాతలు
  • n భూముల ధరలకు రెక్కలు.. ఉపాధికి ఢోకా లేదు.. 
  • n మత్స్య కారులకు ఏడాదంతా ఉపాధి

సోన్‌ : రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిధులు మంజూరు చేయగా.. సోన్‌ మండలంలోని శాకెర గ్రామ శివారులో నాలుగేండ్ల క్రితం రూ.4 కోట్లతో చెక్‌ డ్యాం నిర్మించారు. వాగుకు సమాంతరంగా 100 మీటర్ల పొడవు, ఐదు మీటర్ల ఎత్తుతో చెక్‌డ్యాం నిర్మించారు. ఏడాదిలోనే నిర్మాణం పూర్తికాగా.. స్వర్ణవాగులో ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట పడడంతో రెండు కిలోమీటర్ల పొడవున నీటినిల్వ సామర్థ్యం ఏర్పడి నిండుకుండను తలపిస్తున్నది. గతంలో స్వర్ణవాగులో జూన్‌, జూలైలో నీటి ప్రవాహం ప్రారంభమై, మార్చి నాటికి ఆగిపోయేది. చెక్‌డ్యాం నిర్మాణంతో ప్రస్తుతం ఏడాదంతా నీరు నిలిచి ఉండడంతో శాకెరతోపాటు తాంశ, కడ్తాల్‌, గంజాల్‌, కౌట్ల, జాఫ్రాపూర్‌ తదితర గ్రామాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో 60 ఫీట్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ప్రస్తుతం 40 ఫీట్ల మీదికి వచ్చాయి. చెక్‌డ్యాం పరీవాహక ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల పొడవున నీరు నిలిచి ఉండడంతో రైతులు మోటర్ల సాయంతో నీటిని సాగుకు వినియోగిస్తున్నారు. గతంలో వర్షాకాలంలో మాత్రమే పంటలు వేసేవారు. ప్రస్తుతం వానకాలం, యాసంగిలో సాగు చేస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మించకముందు గ్రామంలో కేవలం 20-30 బోర్లు ఉండగా.. ఇప్పుడు 150 వరకు వేసుకున్నారు. దాదాపు 400 మంది రైతులు 800 ఎకరాలకుపైగా సాగు చేస్తున్నారు. గతంలో సరస్వతీ కెనాల్‌ కింద ఆయకట్టు సాగు చేసే రైతులకు శ్రీరాంసాగర్‌ నిండితేనే పంటలకు అవకాశం ఉండేది. ఇప్పుడు శ్రీరాంసాగర్‌ నిండినా చెక్‌డ్యాంలో పుష్కలంగా నీరుండడంతో సాగుకు ఢోకా లేకుండా పోతున్నది. రైతులు రెండు కాలాలు పంట లు పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామంలో ప్రతి రైతు తనకున్న భూమికి నీటిని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 

మత్స్యకారులకు ఏడాదంతా ఉపాధి.. 

స్వర్ణ వాగులో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి చెక్‌డ్యాంలు నిర్మించడంతో మత్స్యకారులకు ఏడాదంతా ఉపాధి లభిస్తున్నది. చెక్‌డ్యాంలో చేపపిల్లలను పెంచుకుంటూ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా శాకెర, కౌట్ల, జాఫ్రాపూర్‌ తదితర గ్రామాలకు చెందిన వారు చేపలు పడుతూ వచ్చిన ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గతంలో వీరికి స్థానికంగా ఉపాధి దొరకకపోవడంతో ఎస్సారెస్పీతో పాటు సాగునీటి చెరువులపై ఆధారపడి జీవిస్తుండేవారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే జీవనోపాధి దొరికేది. సుమారు 30 కుటుంబాల వరకు చెక్‌డ్యాంలో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నాయి. ప్రతిరోజూ చేపలు పట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రెండు పంటలకు ఢోకా లేదు.. 

నాకు నాలుగెకరాల భూమి ఉంది. గతంలో ఒక బోరు వేశా. అంతంత మాత్రంగానే నీరు వచ్చేది. వర్షాకాలంలో పంటకు అవసరమయ్యే నీరు సరఫరా అయ్యేది. వేసవికాలం వచ్చిందంటే ఒక ఎకరం సాగు చేయడమే కష్టంగా ఉండేది. మా గ్రామ శివారులోని స్వర్ణవాగుపై చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. దీనివల్ల ఉన్న బోరుతోనే ప్రస్తుతం నాలుగెకరాలు సాగు చేస్తూ వానకాలం, యాసంగిలో రెండు పంటలు పండిస్తున్నా.

- ఎం.వెంకట్రావ్‌, రైతు logo