మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Aug 28, 2020 , 02:34:33

ఎక్కడికక్కడే యాంటిజెన్‌ టెస్టులు.. వెంటనే ఫలితాలు

ఎక్కడికక్కడే యాంటిజెన్‌ టెస్టులు.. వెంటనే ఫలితాలు

  • n ప్రాథమిక దశలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ
  • n ప్రతిరోజూ రోగుల ఆరోగ్య వివరాలు  తెలుసుకుంటున్న వైద్యులు, సిబ్బంది 
  • n హోం ఐసొలేషన్‌లోనే ఉంటూ  వేగంగా కోలుకుంటున్న బాధితులు

నిర్మల్‌ అర్బన్‌  : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. మెరుగైన వైద్యసేవలను అందించడంతో కొవిడ్‌ బారిన పడిన రోగులు వేగంగా కోలుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. కరోనా వైరస్‌ను వెంటనే నిర్ధారిస్తే నయం చేయడంతో పాటు అతని నుంచి వైరస్‌ ఇతరులకు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ కొవిడ్‌పై అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. దీంతో  అనుమానం ఉన్న రోగులతో పాటు వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ జిల్లాలో టెస్టులు నిర్వహించాలని సూచించడంతో ప్రాథమిక దశలోనే గుర్తించి పాజిటివ్‌ వస్తే మెరుగైన చికిత్స అందించడంతో కేవలం రెండు వారాల్లోనే కోలుకుంటున్నారు.

ఎక్కడికక్కడే టెస్టులు.. వెంటనే ఫలితాలు

కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులు పరీక్షల కోసం అటూ.. ఇటూ తిరుగుతూ ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ క్రమంలో వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించేది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎక్కడి పీహెచ్‌సీల్లో అక్కడే టెస్టులు నిర్వహిస్తున్నారు. వైరస్‌ను ప్రాథమిక దశలోనే కట్టడి చేస్తున్నారు. జిల్లాలోని 21 పీహెచ్‌సీల్లో రోగులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు కిట్లను సైతం అందజేశారు. దీంతో ఎక్కడి పీహెచ్‌సీ పరిధిలోని వారికి అక్కడే టెస్టులు నిర్వహిండంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల వారికి సైతం వారు ఉన్నచోటే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 15 నిమిషాల్లోనే వేగంగా ఫలితాలు వెల్లడిస్తున్నారు. రిపోర్టులను వారి మొబైల్‌కు పంపిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగుల ఇంటికెళ్లి ఆరోగ్య సిబ్బంది మందులు అందజేయడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

జిల్లాలో ఐదువేలకు పైగా టెస్టులు..

నిర్మల్‌ జిల్లాలోని 21 పీహెచ్‌సీల్లో ఇప్పటి వరకు 5625 మంది కరోనా అనుమానిత రోగులకు టెస్టులు నిర్వహించగా.. 1,184 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,035 యాక్టివ్‌ కేసులు ఉండగా.. డిశ్చార్జి అయిన వారు 149 మంది ఉన్నారు. జిల్లా దవాఖాన ఐసొలేషన్‌లో 17 మంది, పాలిటెక్నిక్‌ ఐసొలేషన్‌లో 47 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. మరో 965 మంది హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

వేగంగా కోలుకుంటున్న కరోనా బాధితులు..

కరోనా వైరస్‌పై వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, పోలీసులు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో కొవిడ్‌పై ప్రజలకున్న అపోహలు, ఆందోళలనలు తొలగిపోతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారు హోంఐసొలేషన్‌లోనే ఉంటూ వైద్యులు ఇచ్చిన మందులను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ వేగంగా కోలుకుంటున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఫోన్‌లో తెలుసుకుంటున్నారు. ఇబ్బందులుంటే వెంటనే సమాచారం అందిస్తే దవాఖానలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. కొవిడ్‌ రోగులను, వారి కుటుంబ సభ్యులను ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తే వారు పోలీసుల ముందుండి పోరాడుతున్నారు. 


logo