బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 26, 2020 , 02:24:38

వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

 వీధి వ్యాపారానికి ఆర్థిక భరోసా

  •  n పీఎంఎస్‌వీఏ నిధి ద్వారా రుణాల మంజూరు
  • n నగరంలో ఇప్పటికే 1,415 మంది బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ

కార్పొరేషన్‌: కరోనా నేపథ్యంలో సుమారు ఐదు నెలలుగా వ్యాపారాలు నడువక వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు పెట్టుబడికి దాచి ఉంచిన డబ్బులను ఇంటి అవసరాలకు ఖర్చు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం వ్యాపారం చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా రూ.10 వేల చొప్పున రుణం ఇస్తున్నది. 

 1,415 మందికి మంజూరు

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో వీధి వ్యాపారులను గుర్తించేందుకు మెప్మా ఆర్పీలు సర్వే చేశారు. వీధి వ్యాపారుల వద్దకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేశారు. పేరు నమోదు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే, వివరాలను పరిశీలించి బ్యాంకు ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ నుంచే కొనసాగుతున్నది. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో 7,745 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు మెప్మా అధికారులు గుర్తించారు. వీరందరికీ బల్దియా నుంచి గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే 1,415 మందికి రూ. 10 వేల చొప్పున బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. మరో 3,457 మంది బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, వీధి వ్యాపారుల ఆధార్‌ నంబర్‌కు సెల్‌ నంబర్‌ అనుసంధానం లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. పలువురికి బ్యాంకు ఖాతా కూడా లేకపోవడంతో మెప్మా సిబ్బంది బ్యాంకర్లతో మాట్లాడి జన్‌ధన్‌, ఇతర పద్ధతుల్లో ఖాతాలు తీయిస్తున్నారు. అలాగే, ఆధార్‌ నంబర్‌కు సెల్‌ నంబర్‌ అనుసంధానం చేయిస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని మెప్మా అధికారులు కోరుతున్నారు. 

రుణాలు సక్రమంగా చెల్లిస్తే..

ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా నగరంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో 1,415 మందికి రూ.10 వేల చొప్పున బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ రుణాలను అతి తక్కువ వడ్డీతో 12 నెలల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. వడ్డీ 11 శాతం ఉండగా.. ప్రతి నెలా సక్రమంగా వాయిదా చెల్లిస్తే 7 శాతం వడ్డీ తగ్గింపు ఉండగా.. కేవలం 4 శాతం మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది.logo