బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 26, 2020 , 02:24:42

ప్రకృతి వనం.. పల్లెకు మణిహారం

ప్రకృతి వనం.. పల్లెకు మణిహారం

  • lమండలంలో వేగంగా   విలేజ్‌ పార్క్‌ల ఏర్పాటు పనులు
  • lప్రత్యేక చొరవ చూపుతున్న   ప్రజాప్రతినిధులు, అధికారులు

శంకరపట్నం: పల్లె అంటేనే ప్రకృతి రమణీయతకు నెలవు.. అలాంటి గ్రామాలకు మణిహారంలా మారనున్నాయి ప్రకృతి వనాలు. హరితహారంలో భాగంగా ప్రతి పంచాయతీలోనూ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుండగా, మండలంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన పార్కులు ఇక నుంచి పల్లె వాసులకూ ఆహ్లాదాన్ని పంచనున్నాయి. 

మండలంలో 21 గ్రామాల్లో తెలంగాణ సర్కారు ఉపాధి హామీ నిధులతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నది. వీటిలో అన్ని రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే జాతుల మొక్కలు పెంచేందుకు పూనుకున్నది. అర్కండ్ల, గొల్లపల్లి, చింతలపల్లె గ్రామాలు మినహా మిగతా అన్ని చోట్లా పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మూడు గ్రామాల్లో స్థల సేకరణ అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి.

తాడికల్‌లో శరవేగంగా పూర్తి

పల్లె ప్రకృతి వనం ఏర్పాటు తాడికల్‌లో శరవేగంగా పూర్తయింది. దాదాపు 99 శాతం పనులు జరిగాయి. ఎస్సారెస్పీ క్వార్టర్లలోని ఎకరం స్థలంలో ఈ వనాన్ని జూన్‌ 30న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రారంభించగా, జూలై 7న కలెక్టర్‌ శశాంక సందర్శించి మొక్క నాటారు. సర్పంచ్‌ కీసర సుజాత తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను గమనించి ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రీయ పద్ధతిలో వనాన్ని పెంచి సంరక్షించాలని సూచించారు. సర్పంచ్‌ దంపతులతో పాటు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌, సిబ్బందితో కలిసి ప్రతి రోజూ పార్కుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఓ రైతు సహాయంతో నీటి వసతి కల్పించారు. మంచెపై ఉండి సంరక్షణ బాధ్యతలు చూసే వనసేవక్‌తో పాటు మరో వాచ్‌మన్‌ను నియమించారు. ప్రతి రోజూ ఇద్దరు కూలీలు మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఏదైనా మొక్క చనిపోతే ఆ స్థానంలో వెంటనే కొత్తది నాటుతున్నారు. ఎంఎస్‌వో జయశంకర్‌, ఎంపీడీవో వినోద, ఎంపీవో శ్రీధర్‌ తదితర అధికారులు వారానికి ఓసారి పర్యవేక్షిస్తున్నారు.

శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాటు

అటవీ శాఖ అధికారుల సహకారంతో పార్కును పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఎకరం స్థలంలో వెయ్యి వరకు మొక్కలను మూడు వరుసల్లో నాటారు. ప్రత్యేక చొరవతో సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పార్కు హద్దుల్లో భారీ వృక్షాలుగా పెరిగే మొక్కలు, మధ్యలో ఏపుగా ఎదిగే వాటిని నాటారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే వాకింగ్‌ ట్రాక్‌, సేద తీరడానికి బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌, పిల్లలకు ఆట సామగ్రిని సైతం సమకూర్చనున్నారు. 


logo