గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Aug 22, 2020 , 00:12:52

భూములను వెంటనే గుర్తించాలి

భూములను వెంటనే గుర్తించాలి

ఎదులాపురం : పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌షెడ్ల నిర్మాణాలకు భూములను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్‌, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..  జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రాధాన్యతాక్రమంలో చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్‌షెడ్ల నిర్మాణాలకు భూములను గుర్తించడంలో అధికారులు సంతృప్తికరంగా పనిచేస్తున్నారన్నారు. అయినప్పటికీ కొన్ని మండలాల్లో భూములను గుర్తించలేదని, ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. ఇప్పటికే గుర్తించిన భూముల్లో పనులను ప్రారంభించాలని, రోజువారీ పనుల ఫొటోలు, రిపోర్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా టెస్టులు పెంచినట్లు చెప్పారు. నిత్యం 1850 చొప్పున పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యశాలలు, రిమ్స్‌లో పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ర్యాపిడ్‌ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలస్థాయి అధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలకు ఈ విషయంపై తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో సామరస్యంగా భూములను సేకరించవచ్చన్నారు. ప్రభుత్వ భూములను సేకరించి వెంటనే పనులు ప్రారంభించాలని, సమస్యలు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మండలస్థాయి అధికారులు సమన్వయంతో గ్రామాల్లో సందర్శించి, భూములను గుర్తించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జడ్పీసీఈవో కిషన్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీవో జే రాజేశ్వర్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు ఉన్నారు.


logo