ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 22, 2020 , 00:13:19

విఘ్నరాజా నమోస్తుతే..

విఘ్నరాజా నమోస్తుతే..

సర్వ విఘ్నాలు తొలిగించే దేవుడు వినాయకుడు. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు  పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఏటా వాడవాడనా అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు ఈ సారి కరోనా కష్టాలు తప్పడం లేదు. వైరస్‌ నేపథ్యంలో వేడుకలను మూకుమ్మడిగా జరుపుకునే పరిస్థితి లేదు. అందుకే ఇండ్లల్లోనే చిన్న మట్టి గణపతిని పూజిద్దాం.. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండి ఆ ఆది దేవుడి ఆశీస్సులు పొందుదాం. మహమ్మారిని పారదోలి కాపాడాలని వేడుకుందాం. సర్వేజనా సుఖినోభవంతు.

మంచిర్యాల, నమస్తే తెలంగాణ/నేరడిగొండ/ ఆదిలాబాద్‌ రూరల్‌ : నేడు వినాయక చవితి.. గణాధిపతి, తొలి పూజ్యనీయుడైన విఘ్నేశ్వరుడిని నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. యేటా అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలను, ఈ యేడాది కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించనున్నా రు. వీధుల్లో గణేశ్‌ మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించగా, ఉత్సవ కమిటీలు సైతం అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పటికే అర్చక సంఘాలు సైతం వేడుకల్లో పూజలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి ఇండ్లలో.. వారే జరుపుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు.

కానరాని సందడి..

వినాయక చవితి వచ్చిందంటే చాలు వారం, పది రోజులుగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో సందడి నెలకొనేది. యువకులు ఉత్సాహంగా పాల్గొనేవారు.. ఎక్కడ చూసినా నవరాత్రుల ఏర్పాట్లపైనే ఉత్సవ కమిటీల చర్చలు సాగేవి. మండపాల నిర్మాణం.. పోటాపోటీగా విగ్రహాల కొనుగోలు, పూజలతో ఉత్సవ కమిటీలు బిజీబిజీగా ఉండేవి. మార్కెట్లు సైతం కొనుగోలు దారులతో కిటకిటలాడేవి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం నిమజ్జనం ఊరేగింపు చేసే అవకాశం కూడా లేదు.

ఈసారి చిన్న గణపతులే..

గతంలో పోటాపోటీగా విగ్రహాలు ప్రతిష్ఠించే మండపాల నిర్వాహకులు ఈసారి చిన్న విగ్రహాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతలో ఎంత పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠిస్తే.. అంత ప్రతిష్ట అని భావించేవారు. కరోనా ప్రభావంతో ఈసారి రెండు, మూడు అడుగులకు మించి విగ్రహాలు పెట్టవద్దని తీర్మానించుకున్నారు. మరోవైపు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలకంటే.. మట్టి ప్రతిమలకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకోవడం శుభపరిణామమని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 


logo