ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Aug 17, 2020 , 01:12:26

‌ ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి నష్టం

‌ ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి నష్టం

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతుండడంతో ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరుతున్నది. చెరువులు అలుగు దూకుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాల్లోకి నీరు చేరడంతో మునిగిపోయాయి. జలపాతాలు జలజల జాలువారుతున్నాయి. ప్రాణహిత, గోదావరి, పెన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్టుల్లో 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. స్వర్ణ, అన్నారం(సరస్వతీ బ్యారెజ్‌) గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో.. చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. జలపాతాల నుంచి నీరు భారీగా జాలువారుతున్నది. వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీంపూర్‌ మండలం పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో పంటలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. బాసర మండలం కిర్గుల్‌(కె) ప్రభుత్వ పాఠశాల భవనం గోడకూలింది. పలుచోట్ల పాత ఇండ్లు నేలకూలాయి. వరద ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. మరోవైపు ఎగువన ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో గోదావరి నదిలోకి వరద చేరుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో బ్యాక్‌వాటర్‌తో గూడెం గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్టుల్లో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు, మంచిర్యాల జిల్లా అన్నారం(సరస్వతీ బ్యారెజ్‌) వద్ద ఆదివారం 20 గేట్లను అధికారులు ఎత్తారు. పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 

మంచిర్యాలలో..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: జిల్లాను వర్షం వీడడం లే దు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఓపెన్‌కాస్టుల్లోకి వరద చేరి, ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. కలెక్టర్‌ భారతీ హోళికేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 08736 - 250501 కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. 

ఎడతెరిపి లేకుండా..

జిల్లాలో గురువారం 12.1 మిల్లీమీటర్లు, శుక్రవారం 23.8, శనివారం 16.2, ఆదివారం 31.3 మిల్లీమీటర్ల చొప్పు న వర్షపాతం నమోదైంది. నాలుగు రోజుల్లోనే 82 మి.మీ వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం వేమనపల్లి  మండలంలో అత్యధికంగా 72.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

నిలిచిన రాకపోకలు.. 

జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నూర్‌ మండలం సుద్దాల, నారాయణపూర్‌, శంకారం, బుద్దారం, కటికెపల్లి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతెర్రె, గొర్రెగట్టు వాగులు, వంకలు పొంగుతున్నాయి. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు మత్తడి దుంకుతుంది. దీని ప్రభావం తో బద్దెపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బద్దెపల్లి, చామనపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. రాచర్ల, ముల్కలపేటకు కూడా బాహ్యసంబంధాలు తెగిపోయాయి. కోటపల్లి మండలం తుంతుంగా ప్రాజెక్టు మత్తడి దుంకుతుండడంతో, దాదాపు 20 గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఏదులబంధం, రొయ్యలపల్లి, సిర్సా, పుల్లగామ, ఆలుగామ, జనగామ, సూపా క, వెంచపెల్లి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాసిపేట మండలం మామిడిగూడెం, గురువాపూర్‌, తిర్మలాపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి కన్నెపల్లి మండలం లింగాల, కన్నెపల్లి గ్రామాల్లో రెండిళ్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. నెన్నెల మండలం ఆవుడం, కోనంపేట గ్రామాల్లో రెండిళ్లు కూలిపోయాయి. లక్షెట్టిపేట మండలం పాత కొమ్ముగూడెంలో ఇల్లు నేలమట్టమైంది. 

గోదావరి, ప్రాణహిత ఉగ్రరూపం..

జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చా యి. వర్షాలతో వెంచపల్లి నుంచి దేవులవాడ వరకు ప్రాణహిత వరద పోటెత్తింది. మరోవైపు ఎగువన ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్ర రూపం దాల్చిం ది. పారుపెల్లి వద్ద నుంచి దేవులాడ వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో బ్యాక్‌వాటర్‌తో గూడెం గోదావరికి వరద ఉధృతి పెరిగింది. దీంతో గూడెంలో లెవల్‌ వంతెన, పుష్కర్‌ఘాట్‌ నీటిలో మునిగింది. సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ ఓసీపీల్లో 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటల్లింది. 

పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్‌ 

కలెక్టర్‌ భారతీ హోళికేరి అర్జునగుట్ట వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతిని పరిశీలించారు.  చెన్నూర్‌లోని పెద్ద చెరువును పరిశీలించారు. వేమనపల్లి మండలం నీల్వాయి ప్రాజెక్టును సందర్శించారు. లక్షెట్టిపేట మండలం చందారంలో వరదను అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. దండేపల్లి మండలం పెద్దపేట చెరు వు, జన్నారం మండలం వెంకటాపూర్‌, మురిమడుగు గ్రామాల్లోని చెరువులు, దొనబండ ఊర చెరువును పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. భీమిని మండల కేంద్రంలోని చెరువులు, వాగులను ఆర్డీవో శ్యామలాదేవి పరిశీలించారు.

జన్నారంలో 10.8 మి.మీ, దండేపల్లి 18.8, లక్షెట్టిపేట 26. 5, హాజీపూర్‌ 8.5, కాసిపేట 22.1, తాండూర్‌ 22.0, భీమిని 27.0, కన్నెపల్లి 38.1, వేమనపల్లి 72.5, నెన్నెల 42.3, బెల్లంపల్లి 35.9, మందమర్రి 20.0, మంచిర్యాల 33. 6, నస్పూరు 30.8, జైపూర్‌ 32.7, భీమారం 21.5, చెన్నూర్‌ 45.1, కోటపల్లి 56.0 మి. మీ వర్షపాతం నమోదైంది.

సరస్వతీ బ్యారేజ్‌ గేట్ల ఎత్తివేత 

సరస్వతీ బ్యారేజ్‌లోని 20 గేట్లను ఎత్తినట్లు జేఈ రాజేశ్‌ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 


logo