శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 16, 2020 , 01:54:36

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి

  • n పీవో భావేశ్‌మిశ్రా
  • n ఉట్నూర్‌ ఐటీడీఏలో    జాతీయ జెండా ఆవిష్కరణ 

ఉట్నూర్‌ : గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీడీఏ పీవో భావేశ్‌ మిశ్రా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో అంబేద్కర్‌, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి పీవో నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్థిక సహాయ పథకం, వనబంధు కల్యాణ యోజన, సీసీడీపీ ద్వారా పీటీజీ గిరిజనుల అభివృద్ధి, భూ బదలాయింపు చట్టం ద్వారా గిరిజనులకు మేలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 910 ప్రాథమిక పాఠశాలలున్నాయని, అందులోని విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, టీ షర్ట్‌, షూలు, ఆట వస్తువులు అందించినట్లు పేర్కొన్నారు. 59 దిశ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ద్వారా ఇంగ్లిష్‌ మీడియం బోధన చేపడుతున్నామన్నారు. ఐటీడీఏ పరిధిలోని 31 ప్రాథమిక, 186 ఉప ఆరోగ్య కేంద్రాలు, రెండు పౌష్టికాహార కేంద్రాలు, మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. ర్యాపిడ్‌ ఫీవర్‌సర్వే కార్యక్రమంతో పాటు అన్ని గ్రామాల్లో వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయన్నారు. ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు అందించినట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 400 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని, వాటిని ప్రత్యేకంగా ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫ్రీ స్కూల్‌ కార్యక్రమాలు నిర్వహించడం, మాస్టర్‌ ట్రైనర్స్‌ ద్వారా సొంత భాషలో నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సహాయ పథకం ద్వారా 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌ కింద 200 యూనిట్లకు రూ.577 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. ఇందుకు గాను 126 యూనిట్లకు సబ్సిడీ విడుదలైందన్నారు. పీటీజీ గ్రామాలకు వారి ఆర్థికాభివృద్ధికి సీసీడీపీ పథకం ద్వారా వివిధ కార్యక్రమాలకు గాను నిధులు విడుదల చేసి మౌలిక వసతులు, వైద్య, విద్య రంగాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వనబంధు కల్యాణ యోజన ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కెరమెరి, వాంకిడి, తిర్యాణి మండలాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, తాగునీటి సరఫరాతో పాటు మౌలిక సదుపాయాల కోసం రూ.10 కోట్లు విడుదల చేశామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. భూ బదలాయింపు చట్టం, అటవీ హక్కు గుర్తింపు చట్టం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీసీసీ ద్వారా 10 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌ పట్టణాల్లో పల్లిపట్టి, న్యూట్రిబాస్కెట్‌, కాంక్రీట్‌ మిక్సింగ్‌ యూనిట్‌, సబ్బులు, షాంపు లాంటి 10 ఇండస్ట్రీలను ఎంఎస్‌ఎంఈ స్కీం ద్వారా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో భీంరావు, డీడీ చందన, జీసీసీ డీఎం సదానందం, ఏజెన్సీ వైద్యాధికారి మనోహర్‌, మేనేజర్‌ రాంబాబు, బీఈడీ ప్రిన్సిపాల్‌ మెస్రం మనోహర్‌, వివిధ శాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


logo