శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Aug 15, 2020 , 03:42:13

లోతొర్రెకు భగీరథ జలం

లోతొర్రెకు భగీరథ జలం

  • n సర్కారు చొరవతో , గిరి పల్లెలకు శుద్ధ నీరు
  • n ఇంటింటికీ నల్లాల బిగింపు
  • n తీరిన దశాబ్దాల తాగునీటి గోస
  • n ఆనందంలో అడవిబిడ్డలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మారుమూల గ్రామం లోతొర్రె. ఇక్కడ 188 మంది గోండులు నివాసం ఉంటున్నారు. లోతొర్రెకు దాదాపు అరకిలోమీటరు దూరంలో లోతొర్రె-2 గ్రామం కూడా ఉంది. ఇక్కడ సుమారు 16 కుటుంబాలు ఉన్నాయి. కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలో చుట్టూ కొండ కోనల మధ్య ఈ పల్లెలకు మూడు దారులు ఉంటాయి. ఏ వైపు నుంచి వెళ్లినా పెద్ద ఒర్రె (వాగు)ను దాటాల్సిందే. చిన్నపాటి వర్షానికే వాగు ఉప్పొంగుతుంది. బాహ్యప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోతాయి. గత పాలకుల పట్టింపులేని తనంతో ఇక్కడి ప్రజలు దుర్భర జీవితం గడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి బతుకుల్లో మార్పు వచ్చింది.

మిషన్‌ భగీరథ పరుగులు..

ఇది వరకు ఆ ఊరి ప్రజలు బోర్లు, వాగు నీళ్లు తాగేవారు. నిత్యం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు వెళ్లి తెచ్చుకునేవారు. ఇక వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారు ణం. ఆ బురద నీళ్లే తాగాల్సి వచ్చేది. నిత్యం వ్యా ధుల బారిన పడేవారు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా పరిస్థితి మారింది. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా అధికారులు ఆ ఊరికి నీరందించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. లోతొర్రె-1లో రూ. 17.67 లక్షలు, లోతొర్రె-2లో 12.03 లక్షలతో ట్యాంక్‌, పైప్‌లైన్లు వేశారు. రెండు చోట్ల రూ. 4.18 లక్షలతో సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి.

ఆనందంలో గ్రామస్తులు

లోతొర్రె, లోతొర్రె-2 గ్రామాలకు 24 గంటల పాటు మిషన్‌ భగీరథ నీరు రావడంపై ఆదివాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బురద నీళ్లు తాగి రోగాల బారిన పడేవాళ్లమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవవల్ల ఇప్పుడు అందరం శుద్ధజలం తాగుతూ ఆరోగ్యంగా ఉంటున్నామని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ మిషన్‌ భగీరథ పథకం ఇలాంటి గ్రామాలకు కూడా నీరందిస్తోందని ఒక వీడియో ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్‌ భగీరథ పథకం ఆయన కన్న కలలు నెరవేరుస్తూ తండాలు, గూడేల్లో గిరిపుత్రుల గొంతు తడుపుతోంది.

వానకాలంలో తిప్పలయ్యేది

మా గ్రామస్తులు మంచి నీరు తాగుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తోంది. మాకు మంచినీరు కావాలంటే బోర్లు, వాగు నీళ్లే దిక్కు అనే పరిస్థితి ఉండేది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు వెళ్లి తెచ్చుకునేది. వర్షాకాలంలో పరిస్థితి చాలా దారుణం. ఆ బురద నీళ్లే తాగాల్సిన దుస్థితి. తప్పని పరిస్థితిలో వారు ఆ నీళ్లే తాగేవారు. ఆ నీళ్లు తాగి నిత్యం వ్యాధుల బారిన పడేవాళ్లం. కానీ ఇప్పుడు మంచినీళ్లు తాగుతుంటే ఆనందంగా ఉంది. 

- గంగారాం, గ్రామ పటేల్‌

పడ్డ కష్టం అంతా మరిచిపోయాం

నిజానికి ఈ గ్రామానికి నీరు అందించడం అంతా సాఫీగా ఏం జరగలేదు. ఒక సవాల్‌గా తీసుకుని మరీ పని పూర్తి చేశాం. సామగ్రి, పైపులు తరలింపులో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి నెల రోజులు ఆలస్యంగా పనులు పూర్తి చేశాం. అయినా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. గిరిజనులు నీళ్లు తాగుతుంటే మాకు ధన్యవాదాలు చెబుతుంటే పడ్డ కష్టం అంతా మరిచిపోయాం. 

- గాజుల వెంకటేశ్‌, డీఈ మిషన్‌ భగీరథ logo