శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Aug 15, 2020 , 03:42:16

చెన్నూర్‌ అభివృద్ధే లక్ష్యం

చెన్నూర్‌ అభివృద్ధే లక్ష్యం

  • ప్రతి గ్రామానికీ సీసీ రోడ్లు నిర్మిస్తాం   n రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి
  • n ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌    n పలు గ్రామాల్లో నిర్మాణాలకు భూమి పూజ
  • n రసూల్‌పల్లి పెద్దవాగుపై రూ. 3.37 కోట్లతో చెక్‌ డ్యాం

చెన్నూర్‌ రూరల్‌ : చెన్నూర్‌ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ స్పష్టం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గత పాలకులు రోడ్డు సౌకర్యం కూడా కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు, గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఎర్రగుంటపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి గంగారం, పొన్నారం, బీరెల్లి, నాగాపూర్‌ గ్రామాలకు బీజీ రోడ్డు నిర్మాణాల కోసం రూ.8.23 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దామోదర్‌ రెడ్డి, సర్పంచ్‌లు మడక స్వప్న, నగేశ్‌, అన్నల మానస, భీమిని మంజుల, నరేందర్‌, ముకుం రాజేందర్‌, అయిత పార్వతీ, నాయకులు అయిత సురేశ్‌రెడ్డి, తుమ్మల తిరుపతి రెడ్డి, రత్న సమ్మి రెడ్డి తదితరులు ఉన్నారు.

ముదిగుంట వద్ద చెక్‌డ్యాంకు భూమిపూజ..

జైపూర్‌ : జైపూర్‌ మండలంలోని ముదిగుంట వద్ద రసూల్‌పల్లి పెద్దవాగుపై రూ.3.37కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణానికి విప్‌ సుమన్‌ భూమిపూజ చేశారు. మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో కాన్కూర్‌, ముదిగుంట, రసూల్‌పల్లి, నర్వ గ్రామాల శివారులో రెండు పంటలకు నీరందుతుందన్నారు. నాలుగు గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి, రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు మొదలుపెడుతామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అనంతరం జైపూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదిక పనులను పరిశీలించారు. నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం వ్యవసాయాధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌, జడ్పీటీసీ మేడి సునిత, ఎంపీపీ రమాదేవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అరవిందరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు దుగుట జ్యోతి, ఆసంపల్లి సువర్ణ, ఎంపీటీసీ లింగస్వామి, పార్టీ సీనియర్‌ నాయకులు మధూకర్‌రెడ్డి, గోదారి లక్ష్మణ్‌, మేడి తిరుపతి, బేతు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పాగాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థికి ప్రోత్సాహకం అందజేత..

చెన్నూర్‌ : కాసిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రణయ్‌కి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విప్‌ బాల్క సుమన్‌ ప్రోత్సాహకాన్ని అందజేశారు. జాతీయ స్థాయి హైజంప్‌ (అండర్‌-14 విభాగం)లో రెండు సార్లు బంగారు పతకం సాధించగా, గురుకులాల సంస్థ ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించింది. ఈ సందర్భంగా విప్‌ చెక్కును అందించి, మాట్లాడారు. తెలంగాణ సర్కారు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి ప్రణయ్‌ను అభినందించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రమేశ్‌, స్వేరోస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

విప్‌ను కలిసిన మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు..

నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు విప్‌ను కలిశారు. సభ్యులు కేవీఎం శ్రీనివాస్‌, కొండపర్తి లక్ష్మి,  మహమ్మద్‌ అయూబ్‌, షమా ఆఫ్రీన్‌ తమ ఎన్నికకు కృషిచేసిన విప్‌ సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

రైతు వేదిక పనుల పరిశీలన..

భీమారం : మండల కేంద్రంలోని రైతు వేదిక పనులను విప్‌ సుమన్‌ పరిశీలించారు. నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.