బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Aug 14, 2020 , 01:04:49

ముసురు

ముసురు

  • n కుమ్రం భీం ఆసిఫాబాద్‌,  మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపిలేని వాన
  • n పొంగిపొర్లిన వాగులు.. వంకలు
  • n పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • n ప్రాజెక్టులు, నదుల్లోకి భారీ వదర
  • n నిండుకుండల్లా చెరువులు
  • n ఆర్కేపీ ఓసీపీ గనిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో మూడు రోజులుగా ముసురుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు మత్తడి దుంకాయి. మంచిర్యాలలో 12.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద వస్తుం ది. మరోవైపు ప్రాణహిత నిండుగా ప్రవహిస్తున్నది. వేమనపల్లి మండలంలోని నీల్వాయి వాగు మత్తడి దుంకుతుంది. జన్నారం మండలంలోని పొనకల్‌ వాగు, లోతొర్రె, మహ్మదాబాద్‌ వాగులు పొంగి పొర్లాయి. నస్పూర్‌ ఊర చెరువు అలుగు పారింది. కోటపల్లిలో తుంతుంగా వాగు పొంగింది. లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువు మత్తడి పారుతున్నది. కాసిపేట మండలంలోని సల్పాలవాగు ప్రవాహం పెరిగింది. తాండూర్‌, బెల్లంపల్లి, జైపూర్‌, భీమారం మండలాల్లోని చెరువులు నిండుకున్నాయి. చెన్నూర్‌ మండలంలోని సుద్దాల వాగు నీటి ప్రవాహం పెరిగింది. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ముసురుతో ఆర్కేపీ వోసీపీలో 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయని, 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లిందని మేనేజర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. 

- మంచిర్యాల అగ్రికల్చర్‌/ కోటపల్లి/ బెజ్జూర్‌/ మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌)/ చెన్నూర్‌/ చింతలమానేపల్లి/ రామకృష్ణాపూర్‌


logo