శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Aug 10, 2020 , 23:21:48

వానొచ్చె.. వరదొచ్చె..

వానొచ్చె.. వరదొచ్చె..

  •  అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపిలేని వాన
  • ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రవాణా..
  • ప్రాజెక్టులకు జలకళ.. జలపాతాల హొయలు.. 
  • మత్తడి దుంకుతున్న చెరువులు
  • వాగుల్లోకి పెరిగిన నీటి ప్రవాహం
  • నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రూ.30 కోట్ల నష్టం..
  • పంటలకు జీవం.. రైతుల్లో హర్షం.. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. ఆదివారం అర్ధరాత్రి మొదలైన వాన సోమవారం అర్ధరాత్రి వరకు కూడాకురుస్తూనే ఉంది. మహారాష్ట్రతోపాటు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుండడంతో వరద పోటెత్తుతున్నది. బాసర వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది. జలపాతాలు గలగల పారుతున్నాయి. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దాదాపు రూ.30 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కాగా.. సాగు చేసిన పత్తి, మక్క, పసుపు, సోయా, వరి తదితర పంటలకు ఈ వర్షం జీవం పోస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదిలాబాద్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ / నిర్మల్‌ టౌన్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా వాన పడుతుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద క్రమేణా వచ్చి చేరుతున్నది. కడెం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ఇప్పటికే పూర్తిస్థాయిలో నీరుంది. ప్రస్తుతం 696 అడుగుల నీటిని నిల్వ ఉంచుతూ వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే కలెక్టర్‌ నీటిని విడుదల చేశారు. గడ్డెన్నవాగులోకి భారీగా వరద వస్తున్నది. దీని పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఒక్కరోజులో ఒక్క అడుగు నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 358 అడుగులు కాగా.. ప్రస్తుతం 357 అడుగులకు చేరుకోగా.. 60 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కూడా వరద క్రమేణా పెరుగుతున్నది. మహారాష్ట్రతోపాటు నిజామాబాద్‌ పరీవాహక ప్రాం తంలో వర్షాలు కురుస్తుండడంతో బాసర గోదావరి వద్ద నీటి మట్టం గంటగంటకూ ఎక్కువవుతున్నది. ఎస్సారె స్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (91 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1074 (37.844టీఎంసీ లు) నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 8,345 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చిన్న సుద్దవాగు, సదర్మాట్‌ కూడా జలకళను సంతరించుకున్నాయి. దీనికితోడు 721 చెరువుల్లో ఇప్పుడిప్పుడే నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణవాగులో నీటి ప్రవాహం పెరగడంతో శాకెర, ఆలూరు వద్ద అలుగు పారుతున్నది. 

కట్టిపడేస్తున్న జలపాతాలు..

ప్రకృతి ఒడిలో ఒదిగిన జలపాతాలు హొయలు పోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. నార్నూర్‌ మండలం మాన్కాపూర్‌లో ఉన్న పారేఖాతి, నడ్డంగూడ వద్ద గుండాయి, గాదిగూడ మండలం ఝరిలోని మైసమాల్‌, బోథ్‌లోని పొచ్చెర జలపాతాలు నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలపాతాలకు వరద పోటెత్తుతున్నది. దీంతో ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహం చూపరులకు కనువిందు చేస్తున్నది. లింగాపూర్‌ మండలంలోని మిట్టె జలపాతం, తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

నమోదైన వర్షపాతం ఇలా.. 

ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ వానకాలంలో సగటు వర్షపాతం 1,100 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 645.8 మిల్లీ మీటర్లుగా నమోదవ్వాల్సి ఉండగా.. 534.3 మిల్లీ మీటర్లు నమోదైంది. ఆదిలాబాద్‌ రూరల్‌, గుడిహత్నూర్‌, సిరికొండ, గాదిగూడ, జైనథ్‌, భీంపూర్‌ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సోమవారం సగటున 18.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉట్నూర్‌ మండలంలో ఎక్కువగా 40.6 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అత్యల్పంగా తలమడుగులో 11.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 

నిర్మల్‌ జిల్లాలో..

నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా సోమవారం 29.33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాసరలో అత్యధికంగా 67.8 మి.మీ. వర్షం కురిసింది. ఖానాపూర్‌లో అతి తక్కువగా 12.7 మి.మీ. నమోదైంది. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఖానాపూర్‌-నిర్మల్‌ రహదారిపై చెట్టు విరిగిపడింది. పోలీసులు యువకుల సహాయంతో తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.  

మంచిర్యాల జిల్లాలో..

జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం సోమవారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం 10.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో 21.8 మిల్లీ మీటర్ల వర్షం కురియగా, దండేపల్లి మండలంలో 15, లక్షెట్టిపేటలో 1.2, హాజీపూర్‌లో 1.8, కాసిపేటలో 11.3, తాండూరులో 13.9, భీమినిలో 5.1, కన్నెపల్లిలో 7.4, వేమనపల్లిలో 9.5, నెన్నెలలో 3.2, మంచిర్యాలలో 10.5, మందమర్రిలో 10.8, బెల్లంపల్లిలో 12.8, జైపూర్‌లో 15.3, భీమారంలో 5.8, చెన్నూర్‌లో 18.7, నస్పూర్‌లో 14, కోటపల్లి మండలంలో 8.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్‌ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ఆర్కేపీ ఓసీపీలో 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిపివేసినట్లు తెలిపారు. 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. శ్రీరాంపూర్‌ ఓసీపీలో మూడు బదిలీల్లో కలిపి 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

ప్రాజెక్టుల్లోకి భారీ వరద..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. నీల్వాయి ప్రాజెక్టు సామర్థ్యం 124 మీటర్లు కాగా, పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో 160 క్యూసెక్కులు ఉంది. ర్యాలీవాగు ప్రాజెక్టు సామర్థ్యం 151.500 మీటర్లు కాగా, ఇది కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఈ ప్రాజెక్లు ఇన్‌ఫ్లో 30 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో కూడా 30 క్యూసెక్కులు ఉంది. ఇక గొల్లవాగు ప్రాజెక్టు సామర్థ్యం 155.50 మీటర్లు, ఆ ప్రాజెక్టులో 153.300 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 26 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో 26 క్యూసెక్కులు ఉంది. ఇక జిల్లాలో పలుచోట్ల చెరువులు నిండి మత్తళ్లు దూంకుతున్నాయి. చెన్నూర్‌ మండలంలోని సుద్దాల వాగు ఉప్పొంగి తాత్కాలిక వంతెన తెగింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు సుబ్బరాంపల్లి వద్ద ఉన్న వాగు మీద తాత్కాలిక వంతెన తెగడంతో నారాయణపురం, రాగిపేట పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

జిల్లాలో వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 12.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కెరమెరి మండలంలో గత 24 గంటల్లో అత్యధికంగా 23.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, వాంకిడిలో అత్యల్పంగా 4.1 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 574.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రం భీం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలుకాగా, ఇప్పటి వరకు 8.989 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 230 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేటు అర మీటరు వరకు ఎత్తి 140 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వట్టివాగు ప్రాజెక్టు సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.291 టీఎంసీల నీటి మట్టానికి చేరింది. ప్రాజెక్టులోకి 335 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 10 క్యూసెక్కులు వదిలిపెడుతున్నారు. జిల్లాలోని పెద్దవాగు నిండుగా ప్రవహిస్తున్నది. ప్రాణహిత నది ఉరకలేస్తున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడంతో జలకళసంతరించుకున్నది.