బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Aug 07, 2020 , 03:52:12

ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం

ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం

(మంచిర్యాల, నమస్తే తెలంగాణ )  

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో అంతర్భాగమైన ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఇందుకు సంబంధించి ఉద్యాన పంటలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహకాలు అందించి రైతులు ఆ వైపు సాగేలా ప్రణాళికలు రూపొందించింది. నేలలు, నీటి వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల వారీగా సాగు చేయాల్సిన ఉద్యాన వన పంటలను ఎంపిక చేసి రాయితీలను ప్రకటించింది. ఉద్యానవన శాఖ రూపొందించిన పంటల ప్రణాళికలను ఉపాధి హామీ పథకం కింద అమలు చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో 20,669 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. పండ్ల సాగు 18,200 ఎకరాలు, కూరగాయ లు 1,236 ఎకరాలు, సుగంధ ద్రవ్యాల సాగు 1,120 ఎకరాలు, పూల సాగు 63 ఎకరాల్లో, పట్టు 35 ఎకరాలు, మిగతా 15 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.

ఈ యేడాది 5 వేల ఎకరాలు  అదనంగా..

2020-21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల ఉద్యానవన పంటలకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న పంటలతో పాటు మరో 5 వేల ఎకరాలకు పైగా సాగు చేయాలని నిర్ణయించిం ది. పంటల సాగుకు అవసరమైన సూక్ష్మ, సేద్య పరికరాలను సైతం రైతులకు అందించడానికి అవకాశం కల్పించారు.

సన్న, చిన్నకారు రైతులకు అవకాశం

జిల్లావ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మండలాల వారీగా రైతులకు పంటలపై అవగాహన పెంచే విధంగా చర్యలు చేపట్టారు. రైతులు ఉద్యానవన పంటలు సాగుకు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. నేలలు, స్థానిక వనరుల ఆధారంగా రైతులకు ప్రోత్సహిస్తున్నారు.

రైతులు ముందుకు రావాలి

సన్న, చిన్నకారు రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. పంటకు సంబంధించి హార్టికల్చర్‌ అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ ఏడాది జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంచేందుకు చర్యలు చేపట్టాం. మీ దగ్గరలో ఉన్న ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. 

- సహజ, ఉద్యాన అధికారి, మంచిర్యాల 


logo