శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Aug 07, 2020 , 03:52:13

ఇరిగేషన్‌లో ‘విలీన’ కసరత్తు..!

ఇరిగేషన్‌లో ‘విలీన’ కసరత్తు..!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : మేజర్‌, మీడియం, మైనర్‌, టీఎస్‌ఐడీసీ (ఎత్తిపోతలు) ప్రాజెక్టులం టూ.. ఇప్పటి వరకు వేర్వేరుగా కొనసాగిన వివిధ విభాగాలు, యూనిట్లు ఇకపై ఒకే శాఖగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు మేజర్‌, మీడియం, మైనర్‌, ఐడీసీ.. ప్రాజెక్టులకు వేర్వేరుగా అధికారులు ఉండేవారు. మం డల స్థాయి నుంచి జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయి వరకు వేర్వేరుగా ఇంజినీర్లు, కార్యాలయాలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులుండగా.. అధికారుల సమీక్షకూ సమస్యగా మా రేది. సాగునీటితో పాటు ఇతర సమస్యలు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వద్దకు వచ్చినప్పుడు.. సమీక్ష సమయంలో ఇది మా పరిధి కాద ని.. ఇది వేరే అధికారి చూస్తారని.. వారు రాలేద ని.. ఇలా అధికారుల నుంచి సమాధానాలు వచ్చే వి. ఆయకట్టుకు సంబంధించి మేజర్‌, మీడియం, మైనర్‌, ఐడీసీ..ఇలా ప్రాజెక్టులు, పథకాల వారీగా ఉండేది. జిల్లాల వారీగా ఆయకట్టు ఉండేది కాదు. దీంతో సమీక్ష సమయంలో కొంత ఇబ్బంది ఉండేది. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. జిల్లాల వారీగా అన్నింటికీ కలిపి ఒకే వ్యవస్థ ఉంటే బాగుంటుందని సూచించారు. 

ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని.. జిల్లా ల వారీగా ఇరిగేషన్‌ విభాగాలను ఒకే యూనిట్‌ ఏర్పాటు చేసేందుకుగాను నీటి పారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల సీఈతో పాటు పెన్‌గంగ (ఆదిలాబాద్‌), బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి పథ కం (బెల్లంపల్లి), మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం (నిర్మల్‌)కు ఎస్‌ఈలు ఉన్నారు. వీరితో పాటు జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ ఇరిగేషన్‌ అధికారులు (డీఐవో) ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 26 వరకు మేజర్‌, మీడియం, మైనర్‌ ప్రాజెక్టులు, మరో 3700 వర కు చెరువులున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చెరువులతో మత్తడివాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు నిర్మల్‌ మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులు ఆదిలాబాద్‌ సీఈ పరిధిలో ఉండగా.. చెరువులు మాత్రం మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ(హైదరాబాద్‌) పరిధిలోకి వస్తున్నాయి. కడెం, సరస్వతీ కాలువ, ప్యాకేజీ-27, 28లు ఎస్సారెస్పీ ఎస్‌ఈ, సీఈ పరిధిలో ఉన్నాయి. గోదావరి నదిపై ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఎగువన 72 వరకు ఎత్తిపోతల పథకాలుండగా.. కొత్తగా నిర్మల్‌ జిల్లాలో 8, మంచిర్యాల జిల్లాలో ఏడు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 ఎత్తిపోతల పథకాలుండగా.. వీటిని జిల్లాల వారీగా టీఎస్‌ఐడీసీ డీఈఈలు పర్యవేక్షిస్తున్నారు. టీఎస్‌ఐడీసీ కార్పొరేషన్‌కాగా.. ఇకపై నీటి పారుదల శాఖలో విలీనం చేయనున్నారు.

ఇక మీదట జిల్లాల వారీగా ఆయకట్టు, ఇరిగేషన్‌ కార్యాలయాలు, అధికారులు ఒకే శాఖ/యూనిట్‌గా ఉండేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలను సేకరిస్తున్నారు. మేజర్‌, మీడియం, మైనర్‌, ఐడీసీ.. ఇలా వేర్వేరుగా ఏఈలు, డీఈఈలు, ఈఈలు, ఎస్‌ఈలు, సీఈలు ఉండరు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, విభాగాలను ఒకే యూనిట్‌గా మార్చేలా కసరత్తు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో ప్రస్తుతం నిర్మల్‌, కడెం ఇరిగేషన్‌ డివిజన్లు ఉండగా.. ఇకపై ఒకటే యూనిట్‌, అధికారి, కార్యాలయం ఉండనున్నది. కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు, సరస్వతీ కాలువ, పాత సదర్మాట్‌ ఆనకట్ట, కొత్త సదర్మాట్‌ బ్యారేజీ, చిన్న సుద్దవాగు, లక్ష్మీ నర్సింహస్వామి (ప్యాకేజీ-27), శారదా దేవి (ప్యాకేజీ-28) ఎత్తిపోతల పథకాలు, మొత్తం 50ఎత్తిపోతల పథకాలు, చెరువులు.. అన్ని ఒకే యూనిట్‌, కార్యాలయం, అధికారి పరిధిలోకి రానున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తు తం ఆదిలాబాద్‌, పెన్‌గంగ డివిజన్లు ఉండగా.. ఇకపై పెన్‌గంగ, సాత్నాల, మత్తడివాగు, ఇతర చెరువులు ఒకే యూనిట్‌ కిందికి వస్తున్నాయి. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు వేర్వేరుగా ఇద్దరు ఎస్‌ఈలు.. రెండు జిల్లాలకు కలిపి ఆదిలాబాద్‌లో సీఈ ఉండనున్నారు. 

మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని డాక్టర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి పథకం ప్యాకేజీ-1,2,3,4,5తో పాటు పలు ప్రాజెక్టులకు ఎస్‌ఈ ఉండగా.. ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల సీఈ పరిధిలో ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వేరే ఎస్‌ఈ, సీఈ ఉండగా.. మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు ఆదిలాబాద్‌ సీఈ పరిధిలో, చెరువులు నిర్మల్‌ ఎస్‌ఈ పరిధిలో ఉన్నాయి. ఇకపై ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు వేర్వేరుగా ఎస్‌ఈలు.. రెండు జిల్లాలకు కలిపి ఒక సీఈ ఉండనున్నారు. బెల్లంపల్లి కేంద్రంగా సీఈ ఉండే అవకాశాలున్నాయి. ప్రతి జిల్లాకో ఎస్‌ఈ, రెండు జిల్లాలకో సీఈ ఉండనున్నారు. జిల్లాలో అన్ని రకాల ప్రాజెక్టులు, చెరువులు,  ఎత్తిపోతల పథకాలు ఒకే యూనిట్‌గా ఏర్పాటు చేస్తుండడంతో.. ఆయకట్టు, మర్మమతులు, నిర్మాణాలపై పర్యవేక్షణ, నిర్వహణ కూడా మరింత సులభతరం కానున్నది. రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టులు, చెరువుల వారీగా ఆయకట్టు వివరాలు పంపుతుండగా.. దీని ఆధారంగా కసరత్తు పూర్తి చేయనున్నారు. జిల్లాకు సంబంధించిన ఆయకట్టు, నిర్వహణ అంతా ఒకే యూనిట్‌, కార్యాలయం, అధికారి పరిధిలోకి వస్తుండడంతో.. ఎలాంటి గందరగోళం లేకుండా మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.