శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 05, 2020 , 01:58:17

కరోనాపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి

కరోనాపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి

కరీంనగర్‌ హెల్త్‌: కరోనాపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తాజా రిజ్వి, కమిషనర్‌ వాకాటి కరుణ, డైరెక్టర్‌ శ్రీనివాసరావులో కలిసి మంగళవారం కోవిడ్‌ అమలు తీరుపై అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ సోకినవారు వ్యాధికన్నా సమాజంలో ఇతరులు ప్రవర్తించే తీరుతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితి ఏర్పడకుండా ప్రజలకు, వ్యాధి సోకిన వారికి సరైన రీతిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. వైద్య సిబ్బందికి అదనంగా 10 శాతం ప్రోత్సాహకమందిస్తామని చెప్పారు. వైరస్‌ సోకిన వారికి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ వసతి ఏర్పాటు చేయాలన్నారు. అనుమానితులను గుర్తించి, ఫ్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టు కిట్ల ద్వారా నిర్థారణ పరీక్షలు చేయాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, రూరల్‌, అర్బన్‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ప్రధాన దవాఖానలకు  పల్స్‌ ఆక్సీమీటర్లను అందిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ మాట్లాడుతూ పరీక్ష కోసం వచ్చేవారి వివరాలు కొత్త యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో సర్వే నిర్వహించి ఐసొలేషన్‌ కిట్లు అందించాలన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకుడు మాట్లాడుతూ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాత, టీబీ అధికారి రవీందర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రవిసింగ్‌,  జువేరియా, డీఐవో సాజిదా, మలేరియా అధికారి  రాజగోపాల్‌రావు, ఐడీఎస్‌పీ అధికారి జ్యోతి, రాజేందర్‌రెడ్డి, డీపీవో రవీందర్‌ పాల్గొన్నారు. 


logo