శనివారం 08 ఆగస్టు 2020
Mancherial - Aug 02, 2020 , 02:47:33

చేతబడి పేరిట చితకబాదాడు

చేతబడి పేరిట చితకబాదాడు

అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

పదిహేను రోజుల తర్వాత వెలుగులోకి..

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

జైపూర్‌: చేతబడి పేరిట ఓ మహిళను చితకబాదిన సంఘటన జైపూర్‌ మండలంలోని కుందారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జైపూర్‌ ఏసీపీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. కుందా రానికి చెందిన సెగ్యం మల్లేశ్‌ గత సంవత్సరం కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రజితకు తల్లిదండ్రులు లేరు. దంపతులిద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మల్లేశ్‌ తన స్వగ్రామం కుందారం వచ్చి నివాసం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం రజిత పాపకు జన్మనిచ్చింది. ప్రసవమైనప్పటి నుంచి ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో మంచిర్యాల, కరీంనగర్‌లోని పలు  వైద్యశాలల్లో చికిత్స చేయిస్తున్నారు. నయం కాకపోవడంతో రజిత బాబాయ్‌ అయిన రవీందర్‌ జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన దొగ్గల శ్యాం అనే ఓ భూతవైద్యుడిని తీసుకువచ్చి వైద్యం చేయించారు. ఆయన వైద్యం పేరుతో రజితకు చేతబడి ఉందంటూ ఇష్టం వచ్చిన రీతిలో చితక బాదినట్లు తెలిపారు. ఈ సంఘటనలో గాయపడ్డ రజిత చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖాన లో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నది. భూత వైద్యుడు వైద్యం చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో బయటకు రావడంతో విషయం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న  ఏసీపీ నరేందర్‌ సంఘటనపై విచారణ చేపట్టారు. 

పోలీసుల అదుపులో నిందితులు

భూత వైద్యం పేరుతో బాలింతపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన వైనం సోషల్‌ మీడియలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. కేశవపట్నం ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో పోలీసులు మహిళ స్వగ్రామం గద్దపాకలో విచారణ జరిపారు. అనంతరం జమ్మికుంట పోలీసులతో కలిసి జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన భూత వైద్యుడు దొగ్గల శ్యాంను అరెస్ట్‌ చేశారు. అలాగే అతనికి సహకరించిన గద్దపాకకు చెందిన పులికోట రవీందర్‌ అనే వ్యక్తిని వీణవంక మండలం బేతిగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నిందిలిద్దరిని విచారణ కోసం జైపూర్‌ పోలీసుల కస్టడీకి అప్పగించినట్లు కేశవపట్నం ఎస్‌ఐ రవి వెల్లడించారు. 


logo