గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Aug 01, 2020 , 01:07:27

కానిస్టేబుల్‌ దంపతుల సస్పెన్షన్‌

కానిస్టేబుల్‌ దంపతుల సస్పెన్షన్‌

మంచిర్యాలటౌన్‌ : సిక్‌ లీవ్‌లో ఉన్న 19 నెలల కాలానికి వేతనాన్ని పొందేందుకు ఇద్దరు సీఐల సంతకాలు ఫోర్జరీ చేసిన కానిస్టేబుల్‌ దంపతుల ను సస్పెండ్‌ చేస్తూ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.   మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌లో జయచంద్ర(పీసీ నం.3073), మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వనిత  (పీసీ నం.3089)కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు దంపతులు. మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే వనిత 2018 ఆగస్టు 8న సిక్‌ లీవ్‌ తీసుకున్నారు. తర్వాత 2020 మార్చి 8న విధుల్లో చేరారు. సిక్‌లీవ్‌లో ఉన్న 19 నెలల కాలానికి సం బంధించిన  ధ్రువీకరణ పత్రాలను నెల వారీగా స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. కానీ వనిత ఏ ఒక్క నెలలో కూడా పత్రాలు సమర్పించలేదు. ఈ కాలంలో ఇక్కడ సీఐలుగా 13 నెలల పాటు చంద్రమౌళి, 6 నెలల పాటు వెంకటేశ్వర్లు పనిచేశారు.

వీరు వనిత పనితీరుపై పలుమార్లు డీసీపీ, సీపీ కార్యాలయాల్లో సమాచారం అందించారు. అయితే విధుల్లో చేరిన తర్వాత వనిత తన వేతనాన్ని పొందడానికి సిక్‌లీవ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సీఐల సంతకాలతో కూడిన క్లియరెన్స్‌ సర్టిఫికెట్లను కమిషనరేట్‌ కార్యాలయం లో పొందుపరిచారు. సీఐల సంతకాలు సరిపోలక పోవడం, అప్పటికే సీఐలు తమ నివేదికలను ఇవ్వడాన్ని గమనించిన సిబ్బంది డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేయాలని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. విచారణలో సీఐల సంతకాలు ఫోర్జరీచేసినట్లు వెల్లడి కావడం తో  కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడం తో  వారిని సస్పెండ్‌ చేశారు. బాధ్యతాయుతమైన పోలీస్‌ శాఖలో పనిచేస్తూ చట్ట వ్యతిరేకమైన పనిచేసినందుకు కానిస్టేబుళ్లు జయచంద్ర, వనితలను సస్పెన్షన్‌ చేశామని సీపీ వివరించారు. 


logo