ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 31, 2020 , 01:36:12

తండాలకు ప్రగతి దారులు

తండాలకు ప్రగతి దారులు

  • lస్వరాష్ట్రంలో వీడిన దశాబ్దాల నాటి దారిద్య్రం
  • lమంత్రి కేటీఆర్‌ చొరవతో తండాలకు రోడ్లు, వారధులు
  • lవీర్నపల్లి మండలంలో అభివృద్ధి పరవళ్లు
  • lమారిన పల్లెల రూపురేఖలు lహర్షం వ్యక్తం చేస్తున్న అడవిబిడ్డలు

గతుకుల రోడ్లు.. గజంలోతు గుంతలు.. వానకాలం వచ్చిందంటే చాలు వాగులు, వంకలు పొంగి బాహ్య ప్రపంచానికి దూరంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన రోజులు.. ఆపద సమయాల్లో గాల్లో కలిసే ప్రాణాలు.. దారి మధ్యలోనే ప్రసవాలు.. ఇలా చెప్పలేనన్ని ఛేదు అనుభవాలు.. అయినా పట్టింపులేని పాలకులు.. ఇలా దశాబ్దాలుగా బతుకీడ్చిన వీర్నపల్లి మండల తండాలకు స్వరాష్ట్రంలో  టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రాణం పోసింది. వచ్చీరాగానే మంత్రి కేటీఆర్‌ చొరవతో తండాతండాకూ ఏళ్ల నాటి ‘దారి’ద్య్రాన్ని తరిమికొట్టింది. పల్లెపల్లెకూ అద్దాల్లాంటి లింక్‌ రోడ్లు వేస్తూనే, రెండేళ్ల కింద పంచాయతీలుగా మార్చి రాజ్యాధికారాన్ని కట్టబెట్టింది. ఫలితంగా రవాణా సౌకర్యం మెరుగుపడి, దారి కష్టాలు తీరగా,  అడవిబిడ్డల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.              - వీర్నపల్లి   

వానకాలం వస్తుందంటేనే వణుకు.. చినుకుపడితే చాలు చిత్తడిగా మారే రోడ్లు.. వాగులు పొంగి సమీప గ్రామాలతో సంబంధాలు తెగిపోయే పరిస్థితుల మధ్య దశాబ్దాలుగా బతికిన వీర్నపల్లి మండలంలోని తండాలకు స్వరాష్ట్రంలో మంచిరోజులు వచ్చాయి. మంత్రి కేటీఆర్‌ చొరవతో పల్లెపల్లెకు లింక్‌రోడ్లు.. వారధులు నిర్మించడంతో గిరిపుత్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

నాడు కష్టాలు.. కన్నీళ్లే..వీర్నపల్లి మారుమూల మండలం. జిల్లాల పునర్విభజన సమయంలో పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి విడిపోయి 22 తండాలతో ఏర్పడింది. ఇక్కడి పల్లెలకు ఏ అవసరం ఉన్నా ఎల్లారెడ్డిపేటకే వెళ్తారు. ఈ తండాలకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేకపోయేది. వాగులపై వంతెనలు కూడా ఉండకపోయేది. ఏటా వర్షాకాలంలో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. రోజువారీ సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది కాదు. పాఠశాలకు పోవాల్సిన పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యేవారు. జ్వరమొచ్చినా.. ఆపద వచ్చినా.. తండాల్లోనే ఉండాల్సిందే తప్ప వైద్యం చేయించుకునే పరిస్థితే ఉండేదికాదు. కొందరు మహిళలు పురిటినొప్పులతో బాధపడుతూ నడుస్తూ మధ్యలో ప్రసవాలు జరిగిన సంఘటనలూ లేకపోలేదు. ఇలా ఏండ్ల తరబడి నరకయాతన అనుభవించిన ఈ తండాలకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. పలు దఫాలుగా రూ. 27కోట్లు మంజూరు చేసి, తండాల్లో రోడ్లు, లింక్‌ రోడ్లు నిర్మించారు. 

మారిన తండాల రూపురేఖలు.. 

ఎక్కడో విసిరేసినట్టు.. గ్రామాలకు దూరంగా.. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన ఈ గిరిజన తండాలలో రాష్ట్ర సర్కారు భరోసాతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వచ్చీరాగానే మంత్రి కేటీఆర్‌ చొరవతో రోడ్లు నిర్మించగా, రెండేళ్ల కింద మండలంలో పది తండాలు ప్రత్యేక గ్రామపంచాయతీలుగా అవతరించాయి. తండాలను స్వయంగా గిరిజనులే పాలించుకునే అవకాశం వచ్చింది.  దీంతో తాగు, సాగు, విద్యుత్‌, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రతి తండాకు తారు రోడ్డు ఉండడంతో నాటి కష్టాలు లేకుండా ప్రయాణం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

నిర్మించిన రోడ్లు ఇవే..

వీర్నపల్లి-రాశిగుట్ట తండా(2కి.మీ), 

రాశిగుట్ట తండా-భూక్యా తండా(2కి.మీ)

జగదాంబ గుడి-బాబాయిచెరువు తండా రింగ్‌రోడ్డు(3కి.మీ)

వీర్నపల్లి-భూక్యా తండా-బావుసింగ్‌ తండా(3కి.మీ)

భూక్యా తండా-గోన్యానాయక్‌ తండా-బంజేరు(3కి.మీ)

మద్దిమల్ల-లోద్దితండా(2కి.మీ)

రంగంపేట- ఎర్రగడ్డతండా(1కి.మీ)

అడవిపదిర-లాల్‌సింగ్‌తండా-మెయిన్‌రోడ్డు(2కి.మీ)

గర్జనపల్లి-పాతచెరువుతండా-జవహర్‌ తండా-సీతరాంనాయక్‌తండా(5కి.మీ)

గర్జనపల్లి-గర్జనపల్లి తండా, సీతరాంనాయక్‌తండా(3.కి.మీ)

వన్‌పల్లి-బండ తండా(1కి.మీ)

వన్‌పల్లి-కేలోతుతండా(3కి.మీ)

పై తండాలన్నింటికీ రూ. 25కోట్లతో లింక్‌ రోడ్లు, కల్వర్టులను పూర్తిచేశారు. అలాగే గోన్యా నాయక్‌ తండా వద్ద రూ.1.40కోట్లతో, భూక్యా తండా వద్ద రూ.1.30కోట్లతో, లొద్దితండాలో రూ.2.40కోట్లతో వంతెనలను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు.

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి.. 

మంత్రి కేటీఆర్‌ మొదట ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకే ఈ తండాల్లో పర్యటించారు. గిరిజనుల కష్టాలను చూసి చలించిపోయారు. రోడ్ల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, బుట్టదాఖలయ్యాయి. కానీ స్వరాష్ట్రం సిద్ధించి కేటీఆర్‌ మంత్రి కాగా, అప్పటి కరీంనగర్‌ ఎంపీ బోయినిపల్లి  వినోద్‌కుమార్‌తో కలిసి రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేశారు. మండలంలోని 22 తండాలకు ప్రధాన, లింక్‌ రోడ్లకు పలు దఫాలుగా రూ.25 కోట్లు, వంతెనల కోసం మూడేళ్ల క్రితం మరో రూ.5.50కోట్ల (సీఆర్‌ఆర్‌,ఎంఆర్‌ఆర్‌)నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో అనతికాలంలోనే రోడ్లు వేయడంతో ప్రతి తండాకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. 

 రోడ్లు మంచిగైనయ్‌.. 

మాది మద్దిమల్లతండా. మాకు ఏం కావాలన్నా  25 కిలోమీటర్ల దూరంల ఉన్న ఎల్లారెడ్డిపేటనే పోతుంటిమి. దవాఖానకు పోవాలన్నా అదే దిక్కు. ఇక్కడి రోడ్లన్నీ గుంతలతో నిండి ఉండేటియి. వానత్తే మోకాళ్లలోతు గండ్లుపడి నడవరాకపోతుండె. రోగమొచ్చినా.. నొప్పివచ్చినా ఊళ్లెనే ఉండాలి. ఎటూ పోరాకపోతుండె. నరకం చూసేది. మా తండాలో మహిళలకు పురిటినొప్పులు వస్తే నా వద్దకు వచ్చేటోళ్లు. ధైర్యం చేసి 80మంది దాకా పురుడుపోసిన. ఇప్పుడు తెలంగాణ వచ్చినంక మా రోడ్లు మంచిగైనయ్‌. బాధలన్నీ పోయినయ్‌. ఇప్పుడు మాకేమైనా ఆపదస్తే మా తండాకు అంబులెన్స్‌ కూడా వస్తుంది. కేటీఆర్‌ సర్‌ సల్లగ ఉండాలె. 

          - కొడవత్‌ రాజీ, మద్దిమల్లతండా

పురిటినొప్పులతోనే నడిచిన.. 

ఇరవై ఏండ్లు అయితంది కావచ్చు. పెండ్లయి ఈ  తండాకు వచ్చిన. రోడ్లు ఎక్కడా మంచిగలేకపోతుండె. వానత్తే మొత్తం ఆగమైతుండె. కయ్యలు వడుతుండె. అడుగుతీసి బయటపెట్టచ్చేదికాదు. గప్పుడే నాకు నెలలు నిండినయ్‌. దవాఖాన్లకు పోదామంటే రోడ్లు ఇట్ల పాడువడి ఏ బండోడు రాలేదు. ధైర్యం చేసి రెండుకిలోమీటర్లు వీర్నపల్లి దాకా నడిచిన. ఆన్నించి మా ఇంటోళ్లు నన్ను ఎల్లారెడ్డిపేటకు తీసుకుపోయి వైద్యం చేయించిన్రు. అది తలుచుకుంటనే గుండెతరుక్కపోతంది. ఆ బాధలు ఎవరికీ రావద్దు. అట్ట మస్తు ఇబ్బందుల వడ్డం. కానీ టీఆర్‌ఎస్‌ సర్కారు అచ్చినంక మా రందివాసింది. రోడ్లు మంచిగైనయ్‌. బండ్ల బాటలపై కార్లు తిరిగే రోజులు వచ్చినయ్‌.

- నూనవత్‌ సాలవ్వ, (రాశిగుట్టతండా) భూక్యాతండా గ్రామం


logo