మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 30, 2020 , 02:11:06

సామూహిక వ్యాప్తి లేదు..

సామూహిక వ్యాప్తి లేదు..

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా
  • జిల్లాలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష
  • ఉషేగాం, డబోలి, గౌరి, జామ్నిల్లో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల స్థలాల పరిశీలన

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సామూహిక దశకు చేరుకోలేదని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో జిల్లాలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంబై, మర్కజ్‌ నుంచి వచ్చిన వారితోనే ఏప్రిల్‌ 8వ తేదీన జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సామూహిక వ్యాప్తి మాత్రం జరగలేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నదన్నారు. పొరుగున ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి జనాల రాకపోకల కారణంగా ఇక్కడ కొన్ని కేసులు నమోదవుతున్నాయిని పేర్కొన్నారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు రాకుండా ఉండాలని, మిగతా అధికారులు తప్పనిసరిగా విధులకు హాజరవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయరాదన్నారు. కరోనా నిర్ధారణ కోసం జిల్లాకు 975 మెడికల్‌ కిట్లు వచ్చాయని, వాటి ద్వారా పరీక్షలు చేస్తామని తెలిపారు. అలాగే డయాబెటీస్‌, వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు, మురికి ఏరియాల్లో నివసిస్తున్న వారికి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌, సీఐ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

వేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరం..

జైనూర్‌ : ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతాయని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఉషేగాం, డబోలి, గౌరి, జామ్ని గ్రామాలను సందర్శించారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు వేదిక భవనాల నిర్మాణం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. పనులను వేగిరం చేయాలన్నారు. అలాగే పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో దత్తారాం, తహసీల్దార్‌ భుజంగ్‌రావ్‌, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ షేక్‌ రషీద్‌, ఎంపీటీసీ భగవంత్‌రావ్‌, సర్పంచ్‌లు నాగోరావ్‌, సిడాం భీంరావ్‌, రాహుల్‌, ఎంపీవో ప్రభుదేవా, నాయకులు మెస్రం అంబాజీ తదితరులున్నారు.


logo