గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 30, 2020 , 02:11:11

అడవులపై అధ్యయనం నా కల..

అడవులపై అధ్యయనం నా కల..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ: మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరులో ఉంటున్న సుహర్ష తండ్రి భాస్కర్ల శ్రీనివాస్‌ సింగరేణి కార్మికుడు. తల్లి విజయనిర్మల గృహిణి. చిన్నప్పటి నుంచి చదువుల్లో సుహర్ష చురుకుగా ఉండేది. జంతువులు, ప్రకృతి, పర్యావరణం, పక్షులు, స్వచ్ఛమైన గాలి ఈ అంశాలే తనను అడవులపై ఇష్టాన్ని పెంచాయి. తనను ఆ కోర్సు తీసుకునేలా నడిపించాయి. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..

సీటు సాధించింది ఇలా... 

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ అబర్న్‌లో నోటిఫికేషన్‌ పడింది. దీంతో నాతో పాటు చాలా మంది విద్యార్థులు దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రతి విద్యార్థి నుంచి స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌వోపీ) అంటే మనం అక్కడికి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నాం...? ఏ సబ్జెక్టులో ఇంట్రస్ట్‌ ఉంది అనే విషయం వారికి వివరించాలి. దాని ప్రకారం వాళ్లు విద్యార్థులను ఎంపిక చేస్తారు. అందులో మాకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించాను. నాకు ఇద్దరు ప్రొఫెసర్లను అటాచ్‌ చేశారు. వాళ్లిద్దరితో కలిసి ప్రాజెక్టు చేయడం నాకు ఎంతో కలిసివచ్చింది.. చాలా సంతోషంగా ఉంది. 

అడవి అంటే చాలా ఇష్టం... 

మొదటి నుంచి నేను డాక్టర్‌ కావాలని అమ్మా, నాన్న కల. కానీ, నాకు మాత్రం అడవి అంటే  ఇష్టం. అందులో ఉండే జంతువులంటే మక్కువ. అందుకే ఫారెస్ట్రీ చేయాలనేది నిర్ణయించుకున్నా. ఇంటర్మీడియట్‌లో బైపీసీలో జాయిన్‌ అయ్యాను. ఎంసెట్‌ కూడా రాశాను. పెద్ద కాలేజీలో అగ్రికల్చర్‌లో సీటు వచ్చింది. అయినా అందులో జాయిన్‌ కాలేదు. నాకు సైంటిస్ట్‌ కావాలనేది కోరిక. అది కూడా ఫారెస్ట్రీకి సంబంధించి. దీంతో ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీలో సీటు సాధించాను. ఇప్పుడు అక్కడ ఎమ్మెస్సీ ఇన్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సు చేయాల్సి ఉంది. అక్కడ సంపాదించిన విజ్ఞానంతో ఇక్కడ అడవి ఎలా అభివృద్ధి చేయాలి...? తదితర అంశాలపై దృష్టి సారిస్తా. 

కవితక్క ధైర్యం నింపింది..

నాకు అమెరికాలోని యూనివర్సిటీలో సీటు వచ్చిందని తెలియగానే చాలా మంది అభినందించారు. కానీ, మాజీ ఎంపీ కవితక్క ఫోన్‌ చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. తను నాకు చాలా విషయాల్లో స్ఫూర్తి. అలాంటి తను స్వయంగా వీడియో కాల్‌ చేసి అభినందించారు. నీలాంటి వారు తెలంగాణకు గర్వకారణం అని పొగుడుతుంటే ఎంతో ధైర్యంగా అనిపించింది. సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ , కేంద్రమంత్రితో సహా అందరూ అభినందించారు. అదే సమయంలో నాన్న  పనిచేసే చోట అందరూ పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది. 

సీఎం కేసీఆర్‌కు, ప్రియాంక వర్గీస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

అసలు ఈ యూనివర్సిటీ ఏర్పాటు వల్లనే నాలాంటి చాలా మంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రియాంక వర్గీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఆలోచనలతో ఇది రూపుదిద్దుకుంది. తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ నుంచి జాతీయ స్థాయి ప్రతిభతో అధికారులుగా ఎంపిక కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కాలేజీ స్థాపించినట్లు తెలిసింది. అంతేకాకుండా, గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫారెస్ట్‌ కాలేజీ అధ్యాపకులకు బ్రిటీష్‌, కొలంబియా యూనివర్సిటీ, కెనడా రెండు విడుతల్లో శిక్షణ ఇచ్చింది. కోర్సు, సిలబస్‌, టీచింగ్‌ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం మాకు ఎంతో కలిసివచ్చింది. మరోవైపు స్వయంగా కాలేజీ డీన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇలా అన్ని సానుకూల అంశాలు మమ్మల్ని తీర్చిదిద్దాయి. 

జూనియర్‌ కాలేజీ వరకూ ఇక్కడే..

ఐదో తరగతి వరకు రేడియంట్‌ స్కూల్‌లో, ఆరో తరగతి నుంచి పది వరకు కృష్ణవేణి టాలెంట్‌ పాఠశాలలో చదివా. ఇంటర్మీడియట్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో పూర్తి చేశా. మొదట్లో నాన్న వ్యవసాయం చేసేవారు. ఎన్ని కష్టాలు పడినా పిల్లలను చదివించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా కూడా మా కోసం కష్టపడ్డారు. ప్రస్తుతం నాన్న సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. నాకు యూఎస్‌లో సీటు రావడంతో ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని అభినందిస్తున్నారు.