గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 28, 2020 , 02:27:50

అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలి

అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలి

  • మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • జిల్లా స్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశం

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ్‌ యోజన పథకంలో భాగంగా గ్రామాల అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో తయారుచేసి అందించాలని అధికారులకు మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో జిల్లా స్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీకి రూ.20 లక్షల చొప్పున జిల్లాలోని 29 గ్రామాలకు రూ.5కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో పనులు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యాభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు అంగన్‌వాడీ కేంద్ర భవనాలు నిర్మిస్తున్నామన్నారు. షెడ్యూల్డ్‌ కులాల కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు గానూ సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ రెడ్డి, డీపీవో వీర బుచ్చయ్య, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఈవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి వీరయ్య, సంక్షేమ శాఖ అధికారి రవూఫ్‌ ఖాన్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నీరజ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలి రాజు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేశ్‌ బాబు, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారి అంజన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.