గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 23, 2020 , 01:24:40

ప్రతి జీపీ ఆదర్శంగా నిలవాలి

ప్రతి జీపీ ఆదర్శంగా నిలవాలి

దండేపల్లి : గ్రామాల అభివృద్ధిలో ఉపాధి కూలీలను కీలకం చేయాలని, ప్రతి జీపీ ఆదర్శంగా నిలువాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమాలపై సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఉపాధి హామీ నిధులు కూడా మంజూరవుతున్నాయన్నారు. వాటితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సరిపడా పనిదినాలు కల్పించి, రూ.237 కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలన్నారు. ఇందులో సర్పంచ్‌లు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అలసత్వం చూపించవద్దని ఆదేశించారు. వైకుంఠధామాల నిర్మాణం ప్రారంభించి ఆరేడు నెలలు గడుస్తున్నా, ఇంకా బేస్‌మెంట్‌ లెవల్లోనే ఉన్నాయని మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు అధ్వానంగా ఉన్నదని మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ఇంకుడుగుంతలు, డంప్‌యార్డులు, వైకుంఠ ధామాల పనులను పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు, సర్పంచ్‌లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్‌, తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఏపీవో దుర్గాదాస్‌, మండలంలోని సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


logo