బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jul 20, 2020 , 01:14:00

విచ్చలవిడిగా నిషేధిత గ్లైఫోసైట్‌

విచ్చలవిడిగా నిషేధిత గ్లైఫోసైట్‌

జిల్లావ్యాప్తంగా గ్లైఫోసైట్‌‌ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వం 2018 జూలైలో నిషేధించిన ఈ మందును కొందరు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,62,680 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఇందులో దాదాపు 40 శాతం బీటీ-3(ైగ్లెసిల్‌) విత్తనాలు సాగు చేశారు. ఇందుకు రైతులు రూ.25 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. ఎకరం పత్తిలో కలుపు నివారణకు రూ.15 వేల వరకు ఖర్చు అవుతుండడం.. దానికి తోడు కూలీల కొరత ఉండడంతో రైతులు బీటీ-3 విత్తనాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపారు.  - మంచిర్యాల, నమస్తే తెలంగాణ/నెన్నెల 

 గ్లైఫోసైట్ట్‌ ఎందుకంటే..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు నిర్మూలన గ్లైఫోసైట్‌‌ మందు వల్ల నేలతోపాటు మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. మన రాష్ట్రంలో ఈ విషతౌల్యమైన ైగ్లెఫోసెట్‌ కలుపు నివారణ మందును విచ్చల విడిగా వాడుతున్నారు. ఈ మందు పత్తి మొక్కలపై పడకుండా పిచికారీ  చేసుకోవాల్సి ఉంటుంది. అదే బీటీ-3 విత్తనాలు సాగు చేసే పంటలో.. ఎలా పిచికారీ చేసినా ఏమీ కాదు. కలుపు మొత్తం పోతుంది. ఎకరం పత్తిలో రెండు సార్లు కలుపు తీయాలంటే 20 నుంచి 30 మం ది కూలీల అవసరం ఉంటుంది. అదే మార్కెట్‌లో దొరికే గ్లైఫోసైట్‌‌‌ మందు కు రూ. 500, మందు పిచికారీ చేసేందుకు కూలీకి రూ.300 ఇస్తే సరిపోతుంది. ఈ మందు వేయడం వల్ల కలుపు సులువు అవుతుందని, ఖర్చు కూడా మిగులుతుందని రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కలుపు నివారణ మందును అమ్ము తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు పేరు మార్చి మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 గ్లైఫోసైట్‌‌‌ ఫార్ములాతో 20 రకాలకుపైగా గడ్డి నివారణ మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మందు వినియోగించడం వల్ల  భూమిలో సారం తగ్గిపోతుంది. భూమి సమతౌల్యం దెబ్బతిని ఎలాంటి పంటలు పండవు. మొక్కలతోపాటు భూమి లోపలి సూక్ష్మజీవులు, వానపాములు కూడా నశిస్తాయి. నిర్జీవంగా మారిన నేల గట్టిపడి బండలాగా మారుతుంది. నీటి నిలువను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. మందు పిచికారీ సమయంలో గాలితో కలిసి రైతు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల ప్రాణాంతాక కేన్సర్‌కు దారితీస్తుంది. కిడ్నీ వ్యాధులు, కంటిచూపు మందగించడంలాంటివి ఉంటాయి. ఆహార పదార్థాలు కూడా విషపూరితమవుతాయి. పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా మంది రైతులకు ఈ మందు చేసే నష్టం గురించి అవగాహన లేకపోవడం గమనార్హం. కేవలం కలుపు నివారణే ధ్యేయంగా మందును వినియోగిస్తున్నారు. 

మున్ముందు ప్రమాదమే..

రైతులు విచ్చలవిడిగా చల్లుతున్న ఈ ప్రమాదకర మందు వల్ల మున్ముందు మొక్కలు జగమొండిగా మారుతాయి. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటినా వంటి దేశాల్లో ఈ మందు ప్రభావానికి కలుపు మొక్కలు లొంగకుండా ఏపుగా పెరిగిపోతున్నాయి. అమెరికాలో దాదాపు కొన్నికోట్ల ఎకరాల్లో వీటి బెడద తీవ్రంగా ఉంది. కలుపు మందులు చల్లినా మొక్కలు చావకపోగా ఆరు అడుగుల ఎత్తు వరకు పెరగడం అక్కడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.

బ్లాక్‌లో విచ్చలవిడిగా దందా.. 

 గ్లైఫోసైట్‌‌‌పై పోలీసులు దృష్టి పెట్టారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. దీంతో అప్రమత్తమైన వ్యాపారులు బ్లాక్‌ దందాకు తెరలేపారు. మహారాష్ట్ర, ఆంధ్రా నుంచి దిగుమతి చేసి వ్యాపారం సాగిస్తున్నారు. రూ.400 వరకు ఉన్న డబ్బా ఖరీదు అమాంతంగా పెంచేసి రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అమ్ముతున్నారు. తీవ్రతను బట్టి రైతులు ఎకరాకు లీటరు నుంచి లీటరున్నర వరకు పిచికారీ చేస్తున్నారు. జిల్లాలో తాండూరు, భీమిని, నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లితోపాటు పలు ప్రాంతాల్లో ఈ అమ్మకాలు సాగుతున్నాయి. పల్లెల్లో ప్యాకెట్లు, విడిగా కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. వానకాలం ఆరంభంలో సరఫరాకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ముందుగానే తెచ్చిపెట్టుకున్నారు. మరోవైపు వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి చీటీ తీసుకువస్తేనే దుకాణాదారులు రైతులకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఏ మందులు అడిగినా ఇచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు ఎక్కువ లాభం ఉన్న కంపెనీల మందులను రైతులకు అంటగడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాలో పట్టుబడ్డ గ్లైఫోసైట్‌‌‌..

    • ఈ నెల 13న మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 11  గ్లైఫోసైట్‌‌ బాటిళ్లను తాండూరు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, ఏవో కిరణ్మయి పట్టుకున్నారు. వీటి  విలువ సుమారు రూ. 88 వేలు ఉంటుంది.  
    • ఈ నెల 14న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జెల్లి సమీపంలో ఆటోలో తరలిస్తున్న 320 లీటర్ల గడ్డి మందును పట్టుకున్నారు. దీని విలువ రూ.1.04 లక్షలు ఉంటుంది. 
    • ఈ నెల 16న నెన్నెల మండలం గొల్లపల్లి శివారులో 270 లీటర్ల  గ్లైఫోసైట్‌‌ మందు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పట్టుకొని టాటా మ్యాజిక్‌, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మందు విలువ రూ. 1.35 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 
    • ఈ నెల 19న భీమిని మండలం వడాల గ్రామ శివారులో 250 లీటర్ల  గ్లైఫోసైట్‌‌‌ను ఎస్‌ఐ కొమురయ్య పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.12 లక్షల వరకు ఉంటుంది.
     గ్లైఫోసైట్‌‌‌ మందు అత్యంత ప్రమాదకరమైనది. దీనికి మన దేశంలో అనుమతి లేదు. ఈ మందు వాడడం వల్ల భూముల్లో సమతౌల్యం దెబ్బతిని పంటలు పండని పరిస్థితి వస్తుంది. రాను రాను కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మనుషులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. రైతులు ఈ నిషేధిత మందును పంటలకు వాడవద్దు. తేయాకు తోటలకు తప్ప మరే పంటలకు దీనిని వినియోగించరాదు.logo