మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 19, 2020 , 02:37:56

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

మందమర్రి రూరల్‌ : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి, గ్రామీణాభివృద్ధికి పాటుపడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నదన్నారు. వాటిని ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేసి, అమలు చేసేందుకు కృషిచేయాలని సూచించారు. మండలంలోని అన్ని డంప్‌ యార్డులు, శ్మశానవాటికల నిర్మాణాలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అదిల్‌పేట, పులిమడుగు, అందుగులపేట, సారంగపల్లిలో డంప్‌ యార్డులు పూర్తయ్యాయని, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తతో ఎరువులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కల్లాలు, రైతు వేదికల నిర్మాణాలకు అంతా సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం శంకర్‌పల్లిలో కల్లాలు, సండ్రోనిపల్లి శివారు, బొక్కల గుట్ట ప్రాంతాల్లో రైతు వేదికల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగతా చోట్ల వెంటనే స్థలాలు సేకరించి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తికావాలన్నారు. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం సేకరించి, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. అందులో 4 వేల మొక్కలు నాటాలని, వీటిని రూరల్‌ పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలిగినా సర్పంచ్‌లు, ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేషాద్రి, డీపీవో వీర బుచ్చయ్య, ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ ఎల్పుల రవి, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. 


logo