గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 16, 2020 , 02:38:50

ఇంటి నుంచే తర్ఫీదు పొందుతున్న గిరిజన ఉపాధ్యాయులు

ఇంటి నుంచే తర్ఫీదు పొందుతున్న గిరిజన ఉపాధ్యాయులు

  • గిరిజన టీచర్లకు డిజిటల్‌ శిక్షణ దేశంలోనే మొదటిసారి..
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సంయుక్తంగా నిర్వహణ
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  నాలుగు బ్యాచ్‌లు.. 1,100 మంది..
  • ఐటీడీఏ పరిధిలో డీడీలు, ఏసీఏవోల పర్యవేక్షణ

ఉట్నూర్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పదేండ్లకోసారి దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ‘అందరికి సమగ్ర శిక్షణ’ పేరిట వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి తర్ఫీదు ఇస్తుంటాయి. ఇందులో భాగంగా మొట్టమొదటి సారిగా రాష్ట్రంలోని గిరిజన ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తున్నారు. రాష్ట్రంలో 14 బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు భద్రాచలంలో నాలుగు బ్యాచ్‌లు, ఏటూరునాగారంలో నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా నాలుగు బ్యాచ్‌లలో 1100 మంది గిరిజన ప్రాథమిక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వాలని ప్రణాళికలు రూ పొందించి అమలు చేస్తున్నారు. మొదటగా ఆదిలాబాద్‌, బోథ్‌ డివిజన్‌ పరిధిలోని ఉపాధ్యాయులకు ఈనెల 9 నుంచి వచ్చే నెల ఆగస్టు 7 వరకు శిక్షణ కొనసాగనుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నారు.

నైపుణ్యం పెంపునకు ఉపయోగపడుతుంది..

ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ నైపుణ్యం పెంపునకు ఉపయోగపడుతుంది. దీనికోసం ఉమ్మడి జిల్లాలో నాలుగు బ్యాచ్‌లు చేసి సుమారు 1100 మంది మారుమూల గ్రామాల్లో బోధించే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తున్నాం. ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు అందరూ శిక్షణలో పాల్గొనేలా పర్యవేక్షణ చేస్తున్నాం.- ఏసీఎంవో జగన్‌, పర్యవేక్షణ అధికారి, ఉట్నూర్‌. 

ఇంటి వద్దే శిక్షణ..

కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే శిక్షణ అందించడం సంతోషంగా ఉంది. ఆన్‌లైన్‌ శిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్న. ఇది చాలా కొత్తగా ఉన్నప్పటికీ అర్థమయ్యే రితీలో అవగాహన కల్పిస్తున్నరు. శిక్షణలో తెలుసుకున్న మెలకువలు విద్యార్థులకు బోధిస్తా.          - సీత, బొజ్జుగూడ, ఉపాధ్యాయురాలు.

ఉమ్మడి జిల్లాలో నాలుగు బ్యాచ్‌లు.. 

పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో 910 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 675 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 305, మంచిర్యాలలో 84, నిర్మల్‌ జిల్లాలో 52 మంది ఉపాధ్యాయులను నాలుగు బ్యాచ్‌లుగా విభజించి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా, ప్రొజెక్టర్ల ద్వారా బోధించే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. వృత్తి నైపుణ్యం పెంపు, పాఠశాల నిర్వహణ, మెరుగైన బోధన, తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంపై విద్యార్థులకు సులువైన పద్ధతిలో బోధించే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఉన్నతస్థాయి పర్యవేక్షణ

గతంలో ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సమూహంగా ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అవకాశం లేకుండా పోయింది. పైగా పాఠశాలలు పూర్తిగా మూసివేసి ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌ విధానం వైపు ప్రభుత్వం చొరవ చూపింది. ప్రతి ఉపాధ్యాయుడిని ఆన్‌లైన్‌ శిక్షణలో పాల్గొనేలా ఉన్నతాధికారులు చూస్తున్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రం నుంచి గిరిజన శాఖ సూపరింటెండెంట్‌ సుభాష్‌ చంద్రగౌడ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో డీడీలు, ఏసీఏవోలు ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయుల హాజరు శాతం తగ్గిన ప్రాంతాల్లోని ప్రధానోపాధ్యాయులను అప్రమత్తం చేస్తూ శిక్షణ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

సులువైన బోధనకు మార్గం

మారుమూల గ్రామాల్లో బోధించే విద్యార్థులకు శిక్షణ ప్రయోజనకరం. అలాగే సులువుగా బోధించడంతో విద్యార్థులు గుర్తుంచుకునేందుకు దోహదపడుతుంది. అలాగే పాఠశాలల నిర్వహణ అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుంది.          - నాగేశ్వర్‌, సీఆర్‌పీ, రాయిగూడ.


logo