గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 15, 2020 , 02:26:02

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి

  • నెలాఖరుకల్లా డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు పూర్తి చేయాలి
  • నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
  • మంచిర్యాల కలెక్టర్‌ భారతీహోళికేరి
  • వేమనపల్లిలో ఎమ్మెల్సీ పురాణంతో కలిసి అధికారులతో సమీక్ష

వేమనపల్లి : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని మం చిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరీ సూచించా రు. వేమనపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌తో కలిసి సర్పంచ్‌లు, కార్యదర్శులు, మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నదన్నారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు అభివృద్ధి పనులపై దృష్టిపెట్టి, త్వర గా పూర్తయ్యేలా చూడాలన్నారు. డంప్‌యార్డులు, శ్మశానవాటికలు, ఇంకుడుగుంతల నిర్మాణాలను ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని, లేకపోతే నో టీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ‘ఉపాధి హామీ’ ద్వారా పనులు కల్పిస్తున్నాయన్నారు. గ్రామాల్లోని ప్రతి కూలీకి పని కల్పించేలా చూడాలని పేర్కొన్నారు. పనులను ఎంపిక చేసుకొని, పని దినాలతో పాటు రోజుకు రూ.235 కల్పించాలని సూచించారు. బుయ్యారం, కేతనపల్లి గ్రామాల్లో పూర్తయిన కంపోస్ట్‌షెడ్‌లు, శ్మశాన వాటికలను త్వరగా ప్రారంభించి, ఉపయోగంలోకి తేవాలని సూచించారు. వారంలో బుధవారం మధ్యాహ్నం తర్వాత మండల పరిషత్‌ కార్యాలయానికి రావాలని, మిగతా రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేయించాలని కార్యదర్శులకు సూచించారు. పల్లె ప్రకృతి వనాల కోసం గ్రామాల్లో స్థలాలు ఎం పిక చేశారా..? అని తహసీల్దార్‌ మధుసూదన్‌ను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ‘హరితహారం’లో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ కుబిడె మధూకర్‌తో కలిసి కలెక్టర్‌ మొక్కలు నాటారు. అంతకుముందు ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జడ్పీటీసీ స్వర్ణలత, సర్పంచ్‌ గాలి మధుతో కలిసి నీల్వాయి గ్రామ స్వాగత ముఖ ద్వారాన్ని ప్రారంభించారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్డీవో శేషాద్రి, పీడీ రాథోడ్‌ బిక్కు, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ మధుసూదన్‌, పీఆర్‌జే శ్రీధర్‌, ట్రాన్స్‌కో ఏఈ రాజశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు. 


logo