ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 15, 2020 , 02:26:07

ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా

ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా

  •  కలెక్టర్‌ శశాంక 
  •  మైనింగ్‌ శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం

కార్పొరేషన్‌: నగరవాసులకు భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని కలెక్టర్‌ శశాంక తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి ఇసుక సరఫరాపై జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ఇసుక యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుకను సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే 10 ఇసుక రీచ్‌లు ఉన్నాయని, ప్రతి మండలానికి అందుబాటులో ఉన్న మరికొన్ని రీచ్‌లను గుర్తించామన్నారు. ఊటూరు, చల్లూరు, బొమ్మకల్‌, చేగుర్తి, రామంచ, తనుగుల, వెల్ది, లింగాపూర్‌, రేణికుంట, చొక్కారావుపల్లి రీచ్‌ల నుంచి ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రీచ్‌ల వద్ద ఇసుక సరఫరా కోసం ట్రాక్టర్ల నంబర్లు రిజిస్ట్రేషన్‌ చేయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్‌తో పాటు డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉండాలన్నారు. ప్రజలు మీ సేవ కేంద్రాల్లో ఇసుక బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇసుక ఫెనాల్టీ కింద 2019-20లో 362 కేసులకు గానూ రూ. 22,95,700, 2020-21 సంవత్సరానికి గానూ 63 కేసుల్లో రూ.3,90,000 వసూలు చేశామన్నారు.  డీఆర్వో వెంకటమాధవరావు, మైనింగ్‌ ఏడీ వెంకటేశం, ఆర్డీవోలు పాల్గొన్నారు. 

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

కార్పొరేషన్‌:  బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ శశాంక  ముస్లింలకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి బక్రీద్‌ పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు తమ పరిధిలోని ఈద్గాల వద్ద శానిటైజేషన్‌, లైటింగ్‌, తాగునీటి సదుపాయం  కల్పించాలని ఆదేశించారు. బక్రీద్‌ సందర్భంగా ఆవులు, దూడలు, అనారోగ్యంతో ఉన్న పశువులను వధించవద్దని సూచించారు. ఈ నెల రోజులు ఆవులను విక్రయించరాదని, సంతల్లోకి తీసుకురావద్దన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, 24 గంటలు పని చేస్తాయన్నారు. పశు వధశాలలకు బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, డీఆర్వో మాధవరావు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, పంచాయతీ అధికారులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలు నాటిన కలెక్టర్‌, సీపీ

కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ పార్కులో హరితహారంలో భాగంగా కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో మియావాకి పద్ధతిలో నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. 


logo