గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jul 14, 2020 , 03:37:36

‘కాగజ్‌నగర్‌'ను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం

‘కాగజ్‌నగర్‌'ను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం

  • అడవుల సంరక్షణలో ప్రజల సహకారం
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా  సీఎఫ్‌ వినోద్‌ కుమార్‌ 

బెజ్జూర్‌ : కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేద్దామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అటవీ సంరక్షణ అధికారి (సీఎఫ్‌) సీపీ వినోద్‌ కుమార్‌ రేంజ్‌ అధికారులకు పిలుపునిచ్చారు. తిక్కపల్లి సీఏ ప్లాంటేషన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. సహజ నాలాలకు ఇరువైపులా ఒడ్లపై వెదురు మొక్కలు నాటే విధానంపై రేంజ్‌ అధికారులకు సూచించారు. రేంజ్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాగజ్‌నగర్‌ డివిజన్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం నీటి వనరులుగా అడవుల్లో సహజ నాలాలు, సహజ ఊటలు, తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోకి వచ్చిన పులులను స్థానికంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు వన్యప్రాణులను వేటాడకుండా, అడవులను నరకకుండా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. వన్యప్రాణుల ద్వారా పశువులు మృతిచెందినా, పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వ పరంగా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడవులను కాపాడడం, డివిజన్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేయడం ద్వారా కరువును నివారించే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. స్థానికంగా చదువుకున్న యువకులను పర్యాటక కేంద్రాల్లో గైడ్‌లుగా నియమించుకొని ఉపాధి కల్పించే అవకాశాలున్నాయన్నారు. ఇక్కడికంటే తక్కువ వనరులు ఉన్న తడోబా లాంటి ఆవాసాలను పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ కూడా ఏర్పాటు చేసే విషయంపై దృష్టిపెట్టామన్నారు. వచ్చే ఏడాదికి పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు శాఖా పరంగా చర్యలు చేపడతున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌, రేంజ్‌ అధికారులు దయాకర్‌, వేణుగోపాల్‌, డీఆర్వోలు సవిత, శీలానంద్‌ రతన్‌జాడె, ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్‌ ఎఫ్‌బీలు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo