ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jul 13, 2020 , 01:26:25

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సన్నద్ధం

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సన్నద్ధం

మంచిర్యాలటౌన్‌ : మున్సిపాలిటీల్లో గత మార్చిలో నిర్వహించాల్సిన కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్‌ పరిపాలనా శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సూచిస్తూ ఈ నెల 7వ తేదీన 185066/2020-హెచ్‌2 మున్సిపల్‌ కమిషనర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు. జనవరి 22న మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించగా, 25న ఫలితాలు వెల్లడించారు. అదే నెల 27న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. మున్సిపల్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశం నిర్వహించిన 60 రోజుల్లో కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మార్చి 18న ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని మార్చి 16న జీవో 57, 58 జారీ చేశారు. అయితే కొవిడ్‌ -19 లాక్‌డౌన్‌ కారణంగా ఈ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ వాయిదా వేశారు. ప్రస్తుతం తిరిగి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని జారీ చేశారు. జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో మందమర్రి మున్సిపాలిటీ మినహా మిగతా ఆరు పురపాలక సంఘాల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రతి మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేయనున్నారు. అందులో ఇద్దరు ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన వ్యక్తులు ఇద్దరు ఉంటారు. వీరిలో ఒకరు మహిళ ఉంటారు. మిగిలిన ఇద్దరిలో అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఇందులో కూడా ఒకరు మహిళ ఉంటారు. కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సంబంధించి పత్రికల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏడు రోజులు గడువు ఉంటుంది. గడువు ముగిసిన మూడు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థుల నుంచి కౌన్సిల్‌ సమావేశంలో కో ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేస్తారు. 

అర్హతలు  ఇవీ..  

పురపాలక సంఘాల కో ఆప్షన్‌ సభ్యుల నిబంధనలు-2020 ప్రకారం మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఉన్న ఇద్దరు వ్యక్తులు (ఇందులో ఒకరు మహిళ ఉండాలి), అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ఇద్దరి(ఇందులో ఒకరు మహిళ ఉండాలి)ని ఎంపిక చేయాల్సిఉంటుంది. దరఖాస్తుచేసుకునే వారు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. 21 ఏళ్లు పైబడిన వారై ఉండాలి. మున్సిపల్‌ కౌన్సిల్‌లో చైర్మన్‌గా కానీ, వైస్‌ చైర్మన్‌గా కానీ, కౌన్సిలర్‌గా కానీ, ఈ పదవులన్నింటినీ కలిపి మొత్తం ఐదేళ్ల కాలవ్యవధితో పదవిని కలిగి ఉండాలి. లేదా మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ మూడేళ్ల కాలవ్యవధితో పనిచేసిన న్యాయవాది అయి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ పోస్ట్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారు, మున్సిపల్‌ పరిపాలన, పురపాలక శాఖలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన వారై ఉండాలి. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారి కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారిలో కౌన్సిల్‌లో ప్రాతినిథ్యం వహించని సమాజానికి చెందిన వ్యక్తులను నేరుగా ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. ఎంపిక చేసుకోవాల్సిన వ్యక్తుల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వారిలో మున్సిపల్‌ కౌన్సిల్‌ మూజువాణి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ఒకవేళ తక్కువ దరఖాస్తులు వస్తే మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అభ్యర్థులు దరఖాసు ్తచేసుకునే సమయంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతపరచాల్సి ఉంటుంది.


logo