శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 13, 2020 , 01:19:16

‘కరోనా’పై వదంతులు నమ్మవద్దు

‘కరోనా’పై వదంతులు నమ్మవద్దు

మంచిర్యాల టౌన్‌ : కరోనా వైరస్‌ విషయంలో వదంతులను నమ్మవద్దని, ఆందోళన అవసరం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రజలకు సూచించారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు లేవని, సరైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్‌లో బెడ్లు దొరకడం లేదని, పైగా లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని కొందరు వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా సోకిన వ్యక్తులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించే సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. దవాఖానల్లో దాదాపు 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని, మందులు కూ డా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి నిత్యావసరాల తో పాటు ఇతర అవసరాలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే 9849466566 నంబర్‌ ద్వారా సమాచారం అందించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ వ్యాపిస్తున్నదన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, తదితరులు ఉన్నారు.