సోమవారం 03 ఆగస్టు 2020
Mancherial - Jul 12, 2020 , 01:30:26

ప్రాజెక్టులకు వరద..

ప్రాజెక్టులకు వరద..

  •   జిల్లాలో కురుస్తున్న వర్షాలు
  •    ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు
  •    నిండుతున్న జలాశయాలు
  •    పొంగిపొర్లుతున్న ప్రాణహిత
  •    పంటలకు మేలు చేస్తున్న  జల్లులు
  •    ఆనందంలో అన్నదాతలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లతో పాటు చెరువులు, కుంటల్లోకి వరద చేరుతున్నది. కొన్ని మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నిండుకుండలా కుమ్రం భీం ప్రాజెక్టు..

కుమ్రం భీం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తున్నది. ప్రాజెక్టు సా మర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.298 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు లెవల్‌ 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 240.900 మీటర్ల వరకు ఉంది. ఇన్‌ఫ్లో 730 క్యూసెక్కులు కాగా, లెఫ్ట్‌ కెనాల్‌ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిషన్‌ భగీరథ కోసం 10 క్యూసెక్కులు వదులుతున్నారు. చెలిమల ప్రాజెక్టు లెవల్‌ 326.300 మీటర్లు కాగా, ప్రస్తుతం 325.800 మీటర్ల లెవల్‌ ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 370.4550 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం 341.618 ఎంసీఎఫ్‌టీగా ఉంది.

పెరుగుతున్న ఇన్‌ఫ్లో..

మంచిర్యాల జిల్లాలోని ప్రాజెక్టులు సైతం జలకళను సంతరించుకుంటున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటి మట్టం 148 మీటర్లు కాగా, ఇప్పటి వరకు 139.96 మీటర్లు ఉంది. దాని నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 4.867 టీఎంసీల  నీరు నిల్వ ఉంది. ఈ ప్రా జెక్టు ఇన్‌ఫ్లో 457 క్యూసెక్కులు కాగా, అవుట్‌ ఫ్లో కూడా 457 క్యూసెక్కులు ఉంది. హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ కు 331 క్యూ సెక్కులు, రామగుండానికి 36 క్యూసెక్కులు, మంచిర్యాల మి షన్‌ భగీరథ కోసం 27 క్యూసెక్కులు అందిస్తున్నారు. గొల్లవా గు ప్రాజెక్టు లెవల్‌ 155 మీటర్లు కాగా, ప్రస్తుతం 152 మీటర్లు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 0.56 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ర్యాలీవాగు ప్రాజెక్టు లెవల్‌ 151.500 మీటర్లు కాగా, ప్రస్తుతం 150.300 మీటర్లు ఉంది. నీల్వాయి ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్‌ లెవల్‌ 124 మీటర్లు కాగా, ప్రస్తుతం 123.600 మీటర్లు ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 0.731 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.

జిల్లావ్యాప్తంగా 5 శాతం అధిక వర్షపాతం..

జిల్లాలో ఇప్పటి వరకు 5 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 297.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 313.4 వర్షపాతం నమోదైంది. జిల్లాలో రెండు మండలాల్లో అత్యధిక వర్షపాతం, మూడు మండలాల్లో అధిక వర్షపా తం,11 మండలాల్లో సాధారణ, రెండు మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. కోటపల్లిలో 62 శాతం, తాండూరు మండలంలో 86 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాసిపేట, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో అధిక వర్షపాతం దండేపల్లి, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, మందమర్రి, హాజీపూర్‌, చెన్నూరు, భీమారం, జైపూర్‌, నస్పూరు, మంచిర్యాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, లక్ష్సెట్టిపేట, జన్నారం మండలాల్లో తక్కువ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా ఒక్క రోజే 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రాణహితకు పెరిగిన ప్రవాహం..

తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద వచ్చి చేరుతున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర వంతెన వద్ద నిండుగా ప్రవహిస్తున్నది. ఇన్నాళ్లూ నిలకడగా ఉన్న ప్రాణహిత నదిలోకి వరద వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకున్నది. దేవులవాడ సమీపంలోని త్రివేణి సంగ మం వద్ద గోదావరి నదిలో కలసి, లక్ష్మీ బరాజ్‌లోకి నీరు వెళ్తున్నది.

పంటలకు ప్రాణం..

సకాలంలో వానలు పడుతుండడంతో ఇప్పటికే వేసిన పంటలకు మేలు చేకూరుతున్నది. కుంటలు, చెరువులు నిండుతుండడంతో ఇక తమ పంటలకు ఢోకా లేదన్న ధీమా రైతుల్లో వ్యక్తమవుతున్నది. logo