మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jul 08, 2020 , 01:14:14

స్మృతివనం పెద్దల ‘జ్ఞాపకానికి’ వేదికైంది...

స్మృతివనం పెద్దల ‘జ్ఞాపకానికి’ వేదికైంది...

స్మృతివనం పెద్దల ‘జ్ఞాపకానికి’ వేదికైంది. పలువురు తమ తల్లిదండ్రులు, బంధువుల పేరిట మొక్కలు నాటి, వాటిలోనే తమ వారిని చూసుకుంటున్నారు. అక్కడే సేదతీరుతూ వారితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.- రామకృష్ణాపూర్‌ 

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 2015లో మంచి ర్యాల జిల్లా కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో బొక్కలగుట్ట పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ శివారు ప్రాంతం లో గాంధారి వనం ఏర్పాటు చేసింది. అప్పటి పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బాల్క సుమన్‌ కేంద్ర అటవీశాఖ నుంచి రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయించా రు. ఈ నిధులతో అప్పటి జిల్లా అటవీశాఖ అధికారి డా. ప్రభాకర్‌ చిల్డ్రన్‌ పార్కు, నేచర్‌ పార్కు, జింకల పునరావాస కేంద్రాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. నేచర్‌ పార్కులో స్మృతివనం ఏర్పాటు చేశారు. 2016లో అప్పటి అటవీశాఖ మంత్రివర్యులు జోగు రామన్న, మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు మొక్కలు నాటి స్మృతివనాన్ని ప్రారంభించారు. ఇందులో తమ తల్లిదం డ్రులు, లేక బంధువుల జ్ఞాపకార్థం మొ క్కలు నాటుకోవచ్చు. రూ. 2500 చెల్లిస్తే చాలు మొక్కల సంరక్షణతో పాటు ఎవ్వరి జ్ఞాపకార్థం నాటారో వారి పేర్లు, నాటిన వారి పేర్లు కూడా ఏర్పాటు చేస్తారు. స్మృతి వనంలోని రెండు వెంచర్లలో 135 మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి. పలువురు ఇక్కడికి వచ్చి తమ వారి పేరిట నాటిన మొక్కల కింద సేద తీరుతారు. వారితో అనుబంధాలను గుర్తు చేసుకుంటారు. ఇక 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అటవీశాఖ అధికారులు సుమారు 100 మొక్కలు నాటారు. గాంధారివనం జిల్లాలోనే చక్కని పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి సేద తీరుతారు. 

చెట్టు రూపంలో మా అమ్మ బతికే ఉంటుంది

మా అమ్మ పబ్బతినేని సత్తమ్మ జ్ఞాపకార్థం గాంధారి వనంలోని స్మృతి వనంలో మొక్క నాటిన. మా అమ్మగారి రాశి ప్రకారం జమ్మి మొక్క పెట్టిన. చెట్లు ప్రకృతి వర ప్రసాదం. అవి ప్రాణవాయువును, చల్లనీడను అందిస్తాయి. అటవీశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే క్రమంలో గాంధారి వనంలో స్మృతి వనం ఏర్పాటు చేశారు. కొంత డబ్బు ఇస్తే వాళ్లే పెంచి పెద్ద చేస్తారు. ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి చాలా మంది వస్తారు. మేము నాటిన చెట్టు నీడన వారు సేదతీరుతున్నప్పుడు మా తల్లిని గుర్తు చేసుకుంటారు. నాటిన వారిని కూడా గుర్తు చేసుకుంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. మా అమ్మ పేరు మీద నాటిన చెట్టుకింద సేద తీరితే మనశ్శాంతిగా ఉంటుంది. గాంధారి వనం ఉన్నంత కాలం చెట్టు రూపంలో మా అమ్మ బతికే ఉంటుంది.

- పబ్బతినేని వెంకటేశ్వర్‌రావు, వ్యాపారి, మంచిర్యాల జిల్లా

తాత జ్ఞాపకార్థం

మా తాత నరసింహారావు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నామీద చూపిన ప్రేమకు గుర్తుగా గాంధారి వనంలోని స్మృతి వనంలో మొక్క నాటిన. నా భార్య శ్రీదేవి వాళ్ల చిన్న అన్న మనోహర్‌ కాలం చేయగా ఆయన పేరుమీద మొక్క నాటింది. ఈ మొక్కకు ప్రతి రాఖీ పండుగకు  రాఖీ కట్టి తన చిన్న అన్నను చూసుకుంటుంది. యేటా గాంధారి వనానికి కనీసం రెండు మూడు సార్లు అయినా వెళ్లి వస్తాం. అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.- వాల శ్రీనివాస్‌రావు, కోటపల్లి మండల వైస్‌ ప్రెసిడెంట్‌

మా తల్లిదండ్రులను గుర్తు చేస్తాయి

గాంధారి వనంలోని స్మృతివనంలో నాటిన మొక్కలు మా తల్లిదండ్రులు ముత్తినేని పార్వతమ్మ, అర్జున్‌రావును గుర్తు చేస్తాయి. మాది పెద్ద కుటుంబం. మా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములందరం చక్కగా కలిసి ఉంటాం. మా అమ్మానాన్నలు మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. కుటుంబ సమేతంగా వెళ్లి మా అమ్మానాన్నల పెరిట మొక్కలు నాటాం. మేము నాటిన మొక్కలు పెరిగి పెద్దవై కాలుష్యం లేని వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటాం. మాలాగా పెద్దల పేర్లతో మొక్కలు నాటి పెంచాలన్నదే మా ఆకాంక్ష. 
- అత్తి సరోజన, మాజీ ఐసీడీఎస్‌ ఆర్గనైజర్‌, మంచిర్యాల-ఆసిఫాబాద్‌


logo