మంగళవారం 11 ఆగస్టు 2020
Mancherial - Jul 07, 2020 , 02:19:40

నెరవేరిన కల

నెరవేరిన కల

  • l అడవి బిడ్డలకు భూ పట్టాలపై భరోసా
  • lరంగంపేట, ఎర్రగడ్డతండాలో పూర్తయిన సర్వే
  • l307 మంది రైతులకు లబ్ధి
  • lనేడు పట్టాలు అందించనున్న మంత్రి కేటీఆర్‌

వీర్నపల్లి మండలం రంగంపేట, ఎర్రగడ్డతండాలో దశాబ్దాల కాలంగా రెవెన్యూ, అటవీ భూములను సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్న 307 మంది రైతుల కల సాకారమయ్యే సమయం వచ్చింది. అర్హులైన రైతులకు పట్టాలివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, మంత్రి కేటీఆర్‌ అదేశాలతో గతేడాది అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కాగా, వీరికి అమాత్యుడి చేతుల మీదుగా మంగళవారం పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. - వీర్నపల్లి

వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొందరు రైతులు గ్రామంలో భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే సదరు భూములపై ఎలాంటి హక్కు పత్రాలూ లేక అటవీ, రెవెన్యూ అధికారుల వేధింపులతో నరకయాతన అనుభవించారు. కొంతమంది రైతులు కేసులపాలై ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాధల నుంచి వారికి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక జడ్పీటీసీ గుగులోతు కళావతి, స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితి తీవ్రతను వివరించారు. రంగంపేట గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను అదేశించారు.

కదిలిన అధికార యంత్రాంగం 

మంత్రి ఆదేశించిన మరుసటి రోజే కలెక్టర్‌ రంగంపేట గ్రామస్తులతో ఆర్డీవో శ్రీనివాసరావుతో కలిసి సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్య కొలిక్కి రావాలంటే సర్వే చేయాలని నిర్ణయించారు. రెండు శాఖల సమన్వయంతో సర్వే పనులు ప్రారంభించారు. రెండు బృందాలతో అటవీ, రెవెన్యూ భూ సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగింది. సర్వే పనులను ఆర్డీవో, శిక్షణ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు. ప్రస్తుతం సర్వే పనులు పూర్తవడంతో పట్టా పాసుపుస్తకాలు సిద్ధమయ్యాయి.

307 మంది రైతులకు ప్రయోజనం

ప్రస్తుతం రెవెన్యూ భూములకు ప్రభుత్వం పట్టాలిస్తే సుమారు 307 మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. సర్వే నంబర్‌-10లోని సుమారు 281 ఎకరాల్లో 250 మంది సాగు చేసుకుంటున్నారు. రంగంపేట, ఎర్రగడ్డతండా గ్రామాలు కంచర్ల రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. గత ప్రభుత్వాలు పట్టా పాసుపుస్తకాలు అందించగా సదరు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. తదనంతరం భూ రికార్డుల ప్రక్షాళనలో ఆ భూములు అటవీశాఖ పరిధిలోకి వెళ్లడంతో కొత్త పాసుపుస్తకాలు జారీ కాలేదు. ఏళ్ల తరబడిగా ఇబ్బందులు పడుతున్న రైతులు మంత్రి కేటీఆర్‌ చొరవతో హక్కు పత్రాలు పొందనున్నారు. సర్వే పనులు ప్రారంభించి, పట్టాల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.logo