శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jul 07, 2020 , 02:19:42

ప్రగతి వారధులు

ప్రగతి వారధులు

  •  మారుమూల పల్లెలకు స్వరాష్ట్రంలో వంతెనలు
  • lమంత్రి కేటీఆర్‌ చొరవతో వీర్నపల్లి మండలంలో ఐదు బ్రిడ్జీలు
  • l14.60 కోట్లతో పూర్తయిన నిర్మాణాలు
  • lతీరిన అంతర్‌జిల్లా ప్రయాణికుల కష్టాలు
  • lహర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
  • lనేడు ప్రారంభించనున్న అమాత్యుడు

వీర్నపల్లి : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఎల్లారెడ్డిపేట మండలం ప్రస్తుత వీర్నపల్లి మండలంలోని మారుమూల గ్రామాలు, తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. కనీసం రవాణా సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడేవాళ్లు. గుంతలమయమైన ఇరికిరుకు రోడ్లపై ఇబ్బందులు పడుతూ ప్రయాణించేవాళ్లు. వాగులపై వంతెనలు లేకపోవడంతో వరదలొస్తే రాకపోకలు స్తంభించిపోయేవి. తెలంగాణ ఏర్పడక ముందు ఎమ్మెల్యే హోదాలో పర్యటించిన ప్రస్తుత మంత్రి కేటీఆర్‌ ఇక్కడి పరిస్థితిని కళ్లారా చూశారు. రోడ్లతో పాటు వంతెనలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చాక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్కడెక్కడ వంతెనలు అవసరం ఉన్నాయో గుర్తించాలని అధికారులకు సూచించడమే కాకుండా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు వంతెనల నిర్మాణానికి కృషి చేశారు. అందులో భాగంగా మండలంలోని శాంతినగర్‌, వన్‌పల్లి, మద్దిమల్లతండా, భూక్యాతండా, బావుసింగ్‌నాయక్‌తండాలో ఐదు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. 

రూ.14.60 కోట్లు.. ఐదు వంతెనలు

శాంతినగర్‌లో రూ.4.40 కోట్లతో బ్రిడ్జి, చెక్‌ డ్యాం, వన్‌పల్లిలో రూ.3.50 కోట్లు, భూక్యాతండాలో రూ. 2.50 కోట్లు, బావుసింగ్‌నాయక్‌తండా గ్రామ పరిధిలోని గుగులోతుతండాలో రూ.1.70 కోట్లు, మద్దిమల్లతండాలో రూ.2.50 కోట్లతో వంతెనలు నిర్మించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామాలైన శాంతినగర్‌, మద్దిమల్లతండాలలో హైలెవల్‌ వంతెనలు నిర్మించడంతో దూరం తగ్గి మూడు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడింది.

గోస తప్పింది..

ఒకప్పుడు పక్కూరికి పోవాలంటే సరైన రోడ్డు లేక అవస్థలు పడ్డం. ఎన్నో ఏండ్లు గోస పడ్డం. మంత్రి కేటీఆర్‌ సారు దయతో ఊర్ల మధ్య బ్రిడ్జిలు కట్టించిండు. ఇప్పుడు మా బాధలు పోయినయ్‌. మైళ్ల దూరం తిరిగి పోయే గోస తప్పింది.  - తేజావత్‌ రేణ, రాశిగుట్టతండా

ఇబ్బందులు తప్పినయ్‌..

స్వరాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్‌ మారుమూల గ్రామాల సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తున్నరు. గతంలో వన్‌పల్లి బండతండా నుంచి శాంతినగర్‌ గ్రామానికి వెళ్లడానికి నరకం కనిపించేది. వాగు వస్తే మా ఊరికి రాకపోకలు బందయ్యేవి. వేరే ఊళ్లకు పోవడానికి వంతెన లేక అవస్థలు పడాల్సి వచ్చేది. రూ.4.40 కోట్లతో బ్రిడ్జి నిర్మించడంతో ఇబ్బందులు తప్పినయ్‌.

- కమటం మల్లేశం, సర్పంచ్‌ (శాంతినగర్‌)