గురువారం 13 ఆగస్టు 2020
Mancherial - Jul 05, 2020 , 23:35:37

వర్షం కురిసె.. మొక్క మొలిచె..

వర్షం కురిసె.. మొక్క మొలిచె..

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లాలో సాగుకు అనుకూలంగా వర్షం కురుస్తున్నది. వరుణుడి కరుణతో రైతు ఆనందంగా ముందుకు ‘సాగు’తున్నాడు. అడపాదడపా వర్షం పడుతుండడంతో పత్తి పంటకు ఎంతో ఉపయోగంగా మారుతున్నది.  గతేడాదితో పోలిస్తే ఈసారి  పత్తి సాగు విస్తీర్ణం భారీగానే పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏపుగా పెరుగుతున్న పత్తి..

జూన్‌ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తిన రైతులు ప్రస్తుతం డౌర కొట్టడం, కలుపు ఏరివేత పనిలో నిమగ్నమ య్యారు. వర్షాలు అనుకూలంగా కురుస్తుండడంతో మొదటి దఫా ఎరువులను సైతం వేశారు. గతేడాది లక్షా 85 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవగా, ఈసారి ఇప్పటి వరకు లక్షా 10 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌, జైపూర్‌, భీమారం మండలాల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు విత్తగా, మిగతా మండలాల్లో 20 రోజుల వ్యత్యాసంతో వేశారు. మరోవైపు కొంత మంది రైతులు బోరుబావుల కింద నారు మడులను సిద్ధం చేశారు. ముందుగా నారు అలికిన రైతులు భారీ వర్షం పడితే నాట్లు వేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. చెరువుల్లో 70 శాతం వరకు నీరుంది. భారీ వర్షం పడితే చెరువులు, కుంటలు నిండి మత్తడి దూకుతాయి.  

అధిక వర్షపాతం..

 సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటి వరకు అధికంగానే వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 242.6 మిల్లీ మీటర్ల వర్షపాతానికి ఉండగా, 277.4 మిల్లీ మీటర్లు నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కురిసిన వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలిస్తే.. జన్నారంలో 208.4 మిల్లీ మీటర్లు, దండేపల్లిలో 215.9, లక్షెట్టిపేటలో 199.4, హాజీపూర్‌లో 330, కాసిపేటలో 353.3, తాండూర్‌లో 418.9, భీమినిలో 198.1, కన్నెపల్లిలో 246.3, వేమనపల్లిలో 294.8, నెన్నెలలో 335.6, బెల్లంపల్లిలో 290.5, మందమర్రిలో 223.8, మంచిర్యాలలో 253.5, నస్పూర్‌లో 239.3, జైపూర్‌లో 305.3, భీమారం లో 292.6, చెన్నూర్‌లో 243.1, కోటపల్లి మండలంలో 340.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, తొమ్మిది మండలాల్లో సాధారణం, రెండు మండలాల్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.logo