గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jul 05, 2020 , 23:15:04

ఆగ్రో ఫారెస్టుతో అదనపు ఆదాయం

ఆగ్రో ఫారెస్టుతో అదనపు ఆదాయం

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చాలని భావిస్తున్నది. ఈ మేరకు ఆగ్రో ఫారెస్ట్‌ పథకాన్ని రూపొందించి రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నది. సాధారణంగా సాగు చేసే పంటలతో పాటు అదనంగా కొంత భూమిలో, పొలాల గట్లపై, చెరువు కట్టలపై ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్‌ వేప, నీలగిరి, కలప, టేకు, వెదురు ఇతరత్రా మొక్కలను పెంచడం ద్వారా ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించింది.

అనేక ప్రయోజనాలు..

పల్లెల పరిధిలో రైతులు సాగు చేసే సాధారణ పంటలతో పాటు పొలాల గట్ల వెంట టేకు, వెదురు, మలబార్‌ వేప, సీతాఫలం, నీలగిరి జాతుల మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా అదనపు ఆదాయం చేకూరనున్నది. పైగా వృథాగా ఉన్న భూమి వినియోగంలోకి వస్తుంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా టేకు మొక్కల పెంపకం చేపట్టడంతో ప్రజల అవసరాలకు అందించవచ్చు. స్మగ్లర్ల బారి నుంచి అడవులను కాపాడుకొని కలప అక్రమ రవాణాను అరికట్టవచ్చు. 10 గుంటల భూమిలో ఎర్ర చందనం,శ్రీగంధం,మలబార్‌ వేప,నీలగిరి,టేకు,వెదురు ఇతరత్రా చెట్లను 80 వరకు పెంచవచ్చు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 30 ఉంటుంది. మొక్క నాటిన 15 నుంచి 20 సంవత్సరాల్లో వినియోగానికి వస్తుంది. ఒక్కో చెట్టు ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఇక ఒకప్పుడు అన్ని రకాల పండ్లు విరివిగా అందుబాటు ధరలో లభించేవి. కాలక్రమేణా పండ్ల తోటల సాగు విస్తీర్ణం తగ్గడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో పండ్ల మొక్కలు నాటేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.logo