శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Jul 01, 2020 , 03:28:26

పల్లె ప్రగతి అంశాలపై నిర్లక్ష్యం వద్దు

పల్లె ప్రగతి అంశాలపై నిర్లక్ష్యం వద్దు

  •   కలెక్టర్‌ శశాంక 
  •  వివిధ శాఖల అధికారులతో సమీక్ష

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతి అంశాలపై నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం  ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజినీర్లతో ఉపాధిహామీ, పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రధాన అంశాలైన శ్మశాన వాటికలు,  కంపోస్టు షెడ్లు, డంప్‌ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. జూలై 31వ తేదీ వరకు శ్మశాన వాటికలు, ఆగస్టు 15లోగా కంపోస్టు షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్టు షెడ్ల వినియోగం, ఇంకుడు గుంతల నిర్మాణంతో గ్రామాలు శుభ్రంగా తయారవుతాయన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. మురుగు కాలువల్లో పూడికతీత, చెత్తను డంప్‌ యార్డుకు తరలించే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. శాఖల వారీగా గ్రామాలు, మండలాల వారీగా జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాస్‌, ట్రైనీ కలెక్టర్‌ శ్రీ అంకిత్‌, డీపీవో రఘువరన్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్‌, బెన్‌ షాలోం, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.


logo