ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jun 28, 2020 , 02:59:10

రాష్ట్రం ఆదుకుంటే.. కేంద్రం అమ్మేస్తుంది..

రాష్ట్రం ఆదుకుంటే.. కేంద్రం అమ్మేస్తుంది..

 • బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై 
 • సింగరేణి కార్మికుల ఆందోళన

 మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణిది 126 ఏళ్ల చరిత్ర.  ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా కాగా, కేంద్రానికి 49 శాతం వాటాగా ఉంది. దక్షిణ భారతదేశంలో 1889లో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కాగా, ఇల్లందు ప్రాంతంలో మొదటిసారిగా శ్రీకారం చుట్టారు. తర్వాత 1920, డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ మార్చారు. సీమాంధ్ర పాలనలో సింగరేణిని సర్వనాశనం చేశారు. ఇక్కడి వనరులు ఆంధ్రాప్రాంతానికి దోచుకుపోయారు. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి చేసి అక్కడి పరిశ్రమలకు వాడుకున్నారు.  ఉద్యోగ నియామకాలను సైతం పెద్దఎత్తున సీ మాంధ్ర వారితోనే నింపేయడంతో ఇక్కడి వారికి ఉద్యోగాలు సైతం కరువయ్యాయి. ఒకవేళ చేసినా కింది స్థాయి ఉద్యోగాలు మినహా వేరే గత్యంతరం లేని దుస్థితి. కనీస సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతూ కార్మికులు శ్రమకోర్చి మరీ పనులు చేసేవారు. చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత సింగరేణిలో కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. వీఆర్ పేరుతో వేలాది మంది కార్మికులను ఇండ్ల కు పంపించారు. డిస్మిస్ సైతం చేశారు. సింగరేణిలో మేము పని చేయలేం అనే స్థితికి కార్మికులను తీసుకువచ్చారు. 

సీఎం కేసీఆర్ చొరవతో..

  ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది.  సింగరేణి సీఎండీతో కలిసి తీసుకున్న నిర్ణయాల తో సంస్థ లాభాల బాట పట్టింది. ముఖ్యంగా కార్మికుల సంక్షేమం గురించి ఆయన ఎంతగానో శ్రద్ధ తీసుకున్నారు. వారికి లాభాల్లో వాటా చెల్లింపు, దసరా అడ్వాన్స్ పెంపు, ఇలా ఎన్నో విధాలుగా కార్మికులకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని మేలు చేశారు. 

 • సింగరేణిలో కొత్త ఉద్యోగాలు కల్పించారు. ఎనిమిది వేల ఉద్యోగాల కల్పనతో తెలంగాణలోనే  మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా వాసికెక్కింది.  
 • సింగరేణి కార్మికుల దశాబ్దాల కల అయిన కారుణ్య నియామకాల మీద నిర్ణయం తీసుకున్నారు. దీంతో  6500 మంది వరకు లబ్ధి పొందారు.
 • కార్మికులు గృహాలు నిర్మించుకునేందుకు పది లక్షల వరకు తీసుకున్న రుణానికి వడ్డీ మాఫీ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. 
 • కార్మికుల తల్లిదండ్రులకు సైతం కార్పొరేట్ వైద్య సదుపాయం  కల్పించారు. దీంతో కార్మికులకు ఎంతో మేలు జరిగింది. 
 • క్వార్టర్లలో ఉన్న వారికి బేసిక్ ఒక శాతం  విద్యుత్ బిల్లుల కింద కోత విధించేవారు. దానిని మాఫీ చేశారు. ఇది కూడా కార్మికులకు మేలు చేసే అంశమే. 
 • లాభాల వాటా కేసీఆర్ అధికారంలోకి వచ్చే సరికి 18 శాతం ఉండేది. ఇప్పుడు 29 శాతానికి పెంచారు. 
 •  ప్రతి కార్మికుడికీ ప్రొఫెషనల్ టాక్స్ ఉండేది. అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసి  మరీ అది కోత లేకుండా చేశారు.  
 •  ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు. దేశంలో కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు.
 •  సకల జనుల సమ్మె వేతనం సైతం తిరిగి ఇప్పించారు. దాదాపు 35 రోజుల వరకు కార్మికులకు జీతం వచ్చింది. 
 •  దసరా అడ్వాన్స్ సైతం పెంచారు.  
 •  సింగరేణి ప్రస్తుతం ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని 11 ఏరియాల్లో భూగర్భ గనులు, ఒపెన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, సింగరేణి సీఅండ్ ప్రణాళికలతో ఇక్కడే కాకుండా ఇతర రాష్ర్టాల్లో సైతం బొగ్గు బ్లాక్ కైవసం చేసుకుంది. అన్ని సవ్యంగా సాగితే 2025-26 నాటికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఉత్పత్తి సాధన దిశగా ముందుకు సాగుతోంది. వంద మిలియన్ టన్నుల లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. 

కేంద్రం నిర్ణయంతో కుదేలు 

 కేంద్రం రంగ ప్రవేశం చేసి 41 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు కోల్ పాటు సింగరేణికి పెద్దఎత్తున నష్టం చేకూరనున్నది. ఇప్పటివరకు బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలంటే కేవలం సిం గరేణి లేదా కోల్ ఇండియా మాత్రమే పోటీ పడే వి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రైవేట్ వ్యక్తు లు రంగంలోకి వస్తే ఈ రెండు సంస్థలూ కుదేలవుతాయి. సింగరేణి సంస్థను పెద్దన్నలాగా కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఈ సంస్థను పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి కార్మికులు తమ శ్రమ శక్తిని నమ్ముకొని సంస్థను కాపాడుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల్లోకి ముందుకు వెళ్తున్న క్రమంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సింగరేణికి గుదిబండగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంటే, కేంద్రం అమ్ముతోందంటూ పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్రం పునరాలోచించాలి

 బొగ్గు తవ్వకాలను వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం బాధాకరం. కేంద్రం ఈ విషయంపై పునరాలోచించాలి. 130 యేండ్లుగా సింగరేణి సంస్థ సత్తా చాటుతూ బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ వస్తున్నది.  ఇతర దేశాల్లోనూ ఎంతో పేరు తెచ్చుకుంది. ఇలాంటి అనుభవం ఉన్న సంస్థను కాదని కొత్త కంపెనీలకు  అప్పగించడం క్షమించరానిది.  - రవి కిరణ్, కేకే ఓసీ మందమర్రి ఏరియా 

కార్మిక శక్తిని నిర్వీర్యం చేసేందుకే..

 కార్మిక శక్తిని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది.  తెలంగాణకే గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. సింగరేణిలో మన రాష్ట్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. ఎలాగైనా కేంద్రం చేతుల్లో బొగ్గు బావులు చిక్కకుండా చూడాలి.   - యుగంధర్, కేకే ఓసీ మందమర్రి 

 భవిష్యత్తులో ఉద్యోగాలుండవు 

దేశంలో కేంద్ర బీజేపీ ప్రభు త్వం గనుల ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో పర్మినెంట్ ఉద్యోగాలుండవు. అందుకే బొగ్గు గని కార్మికులు గనుల ప్రైవేటీకరణను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో కార్మికులకు గడ్డు పరిస్థితి ఉంటుంది. పనిభారం ఎక్కువవుతుంది. బొగ్గు గనులు ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వరంగ పరిశ్రమగానే కొనసాగించాలి.  -గొరిగె చేరాలు, కోల్ - శ్రీరాంపూర్

2న సమ్మెలో పాల్గొంటాం

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జూలై 2న సింగరేణిలో టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మెలో పాల్గొని కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పటికే సింగరేణి గనుల్లో అన్ని డిపార్ట్ ప్రైవేటీకరణ చేసింది. ఈ బొగ్గు గనుల చట్టాలకు వ్యతిరేకంగా భూగర్భ గనుల్లో సైతం సపోర్టు పనులు, లైన్ ఫైర్ సీలింగ్, కోల్ పనులు ప్రైవేట్ చేసింది. పోరాడి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.   - ఎండీ హైదర్, మైనింగ్ సర్దార్ - శ్రీరాంపూర్logo