మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 16, 2020 , 00:10:35

పేదింట తీరని దుఃఖం

పేదింట తీరని దుఃఖం

  • n మంథని రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృత్యువాత
  • n లాక్‌డౌన్‌తో ఇసుక క్వారీలో పనులు..
  • n కొద్ది రోజులుగా ఉపాధి లేక ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని మృత్యుఒడికి..
  • n అందరివీ పేద కుటుంబాలే..  
  • n అబ్బాపూర్‌, బాలరాజుపల్లిలో విషాదం
  • n శోకసంద్రంలో తల్లిదండ్రులు 

మంథని టౌన్‌/జూలపల్లి: ఇసుక క్వారీలో పనుల్లేక ఇంటి దారి పట్టిన ముగ్గురు మిత్రులు మంథనిలో లారీ ఢీకొని మృత్యువాతపడ్డారు. జూలపల్లి మండలం అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన చొప్పరి రజినీకాంత్‌(22), మిట్ట మధుకర్‌ (25), బాల్‌రాజ్‌పల్లికి చెందిన అడప సురేశ్‌(23) ముగ్గురు మిత్రులు. ఇందులో మధుకర్‌ ఏంబీఏ పూర్తి చేయగా, సురేశ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. రజినీకాంత్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అందరివీ పేద, మధ్య తరగతి కుటుంబాలు కావడం, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో కొద్దిరోజుల క్రితం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌ ఇసుక క్వారీలో చేరారు. కొద్దిరోజులుగా క్వారీ సరిగ్గా నడవడం లేదు. పనుల్లేక పోవడంతో ఇంటిబాట పట్టి, మంథనిలో లారీ ఢీకొనడంతో మృత్యుఒడికి చేరగా, ఆ రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. అందరివీ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కావడం, చేతికొచ్చిన కొడుకులు మృత్యువాతపడడంతో ఆ కుటుంబాలకు తీరని దుఃఖమే మిగిలింది. 

చదువుకుంటూనే పనికి..

 అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి కొమురయ్య, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కొడుకులు. ఇందులో పెద్దవాడే రజినీకాంత్‌. నిరుపేద కుటుంబం. చిన్న రేకుల షెడ్డులో బతుకుతున్నా రు. తల్లిదండ్రులిద్దరూ రోజూ పనిచేస్తేనే పూట గడుస్తుంది. అయినప్పటికీ రజినీకాంత్‌ను కరీంనగర్‌లోని వాణినికేతన్‌ కాలేజీలో డిగ్రీ చదివిస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం. లాక్‌డౌన్‌తో ఇంటివద్దే ఉంటున్న రజినీకాంత్‌, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని క్వారీలో నెల రోజులుగా సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్నాడు.  

ఎంబీఏ చేసి క్వారీకి.. 

అబ్బాపూర్‌కు చెందిన మిట్ట మల్లయ్య, అరు ణ దంపతులకు మధుకర్‌తోపాటు కూతురు ఉంది. మల్లయ్య కౌలు వ్యవసాయంతోపాటు హమాలీ పనిచేస్తుంటాడు. ఎంత కష్టపడ్డా కొడుకును బాగా చదివించాలని అనుకున్నాడు. కరీంనగర్‌లోని అపూర్వ కాలేజీలో డిగ్రీ, మరో కాలేజీలో ఏంబీఏ చదివించాడు. ఈ క్రమంలో మధు కొద్దిరోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో అన్నీ స్తంభించిపోగా, తల్లిదండ్రులకు భారం కావద్దని క్వారీలో సూపర్‌వైజర్‌గా చేరాడు. రోడ్డు ప్రమాదంతో ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఒక్కగానొక్క కొడుకు దూరంకావడంతో ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. 

ఖాళీగా ఉండవద్దని.. 

బాలరాజ్‌పల్లికి చెందిన అడప లక్ష్మి, లక్ష్మయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడే సురేశ్‌. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ రోజూ పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. సురేశ్‌ కరీంనగర్‌లోని అపూర్వ కళాశాలలో డిగ్రీ చదివాడు. అయితే తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకున్న సురేశ్‌ వారికి చేదోడువాదోడుగా ఉండాలని అనుకున్నాడు. మూడు నెలల క్రితం మహదేవ్‌పూర్‌లోని ఇసుక క్వారీలో సూపర్‌వైజర్‌గా చేరాడు.  


logo