బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Jun 14, 2020 , 00:56:38

రైతుబంధుకు కసరత్తు

రైతుబంధుకు కసరత్తు

  • n  దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు
  • n  ఈ సీజన్‌కు ఉమ్మడి జిల్లాలో 6,16,580 మంది అర్హులు
  • n  శనివారం వరకు కొత్తగా 49,710 దరఖాస్తులు

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: రైతుబంధు పథకం కింద ఇప్పటికే నాలుగుసార్లు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదోసారి అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఏటా రైతులు సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. 2018 వాన కాలం సీజన్‌లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా జిల్లాలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి విజయవంతం గా ఈ పథకం అమలవుతోంది. గతంలో ఎకరాకు సీజన్‌కు రూ.4 వేల చొప్పున అందించగా, గత సీజన్‌ నుంచి రూ.5 వేలు అందిస్తున్నది.

కరీంనగర్‌ జిల్లాలో..

రెవెన్యూ శాఖ అధికారులు జిల్లాలో ఇప్పటి వరకు 1,72,034 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. ఇందులో గత యాసంగి  వరకు వ్వయసాయ శాఖ వద్ద 1,48,785 మంది వివరాలు ఉన్నాయి. రైతుబంధు పథకం మొదలైనప్పటి నుంచి 8,850 మంది రైతులు వారి వివరాలను అధికారులకు ఇవ్వడం లేదు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారి లో వివరాలు ఇవ్వని రైతులు 14,399 మంది ఉ న్నారు. ఈ లెక్కన మొత్తం 23,249 మంది ఉ న్నారు. ఇందులో పాత వారి వివరాలు వదిలేస్తే 14,399 మంది రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వరకు 6,965 మంది తమ వివరాలను సంబంధిత అధికారుల కు అందించారు. వీరందరికి రైతుబంధు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. 

జగిత్యాల జిల్లా

ఈ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 1,81,904 మంది రైతులు రైతుబంధు కింద లబ్ధి పొందారు. కొత్తగా 24,294 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఈ ఏడాది జిల్లాలో 2,06,198 మంది రైతులు రైతుబంధు పథకంకు అర్హులుగా నిర్ణయించారు. వీరి వద్ద నుంచి పట్టదారు పాసుపుస్తకాలను తీసుకున్న వ్యవసాయాధికారులు ఆన్‌లైన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో

జిల్లాలో గత సీజన్లలో 96,876 మంది రైతులు లబ్ధి పొందగా, కొత్తగా 10,043 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరి పట్టాదారు పాసుపుస్తకాలను ఏఈవోలు క్షణ్ణంగా పరిశీలించి అమోదం తెలిపారు. కొత్తవారితో కలుపుకుని మొత్తం లబ్ధిదారుల సంఖ్య జిల్లాలో 1,06,919కి చేరింది. దరఖాస్తు  చేసుకున్న రైతుల ఖాతాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో

జిల్లాలో గత సీజన్లలో 115,461 మంది రైతుబం ధు కింద లబ్ధిపొందారు. కాగా, ఈసారి 1,31,42 9 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో 8,408 మంది శనివారం వరకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లోని రైతుల నుంచి అధికారులు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం జిరాక్స్‌ ప్రతులను స్వీకరిస్తున్నారు.


logo