శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Jun 12, 2020 , 02:33:40

ఇంటికో ఇంకుడు గుంత

ఇంటికో ఇంకుడు గుంత

nభూగర్భ జలాల పెంపుపై పాలకవర్గం ప్రత్యేక దృష్టి

nగ్రామస్తుల సహకారంతో   సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ 

nఆదర్శం వెలిచాల  గ్రామ పంచాయతీ  

ఆ ఊరిలో ఏ వీధికెళ్లినా ఇప్పుడే ఊడ్చినట్లుంటుంది.. ఎటు  చూసినా పచ్చదనం ఉట్టిపడుతుంది.. ఎవరి ఇంటికెళ్లినా ముంగిలి ముందర ఇంకుడు గుంత కనిపిస్తుంది.. వెరసి ఈ ఊరు అన్నిరంగాల్లో ముందుంటూ మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. పారిశుద్ధ్య నిర్వహణలోనూ, పథకాల సద్వినియోగంలోనూ ముందున్న రామడుగు మండలం వెలిచాల గ్రామంపై ప్రత్యేక కథనం.. -రామడుగు

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడంలో వెలిచాల పంచాయతీ పాలకవర్గ సభ్యులు పూర్తిస్థాయిలో సఫలీకృతులయ్యారు. సర్పంచ్‌ వీర్ల సరోజన గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దారు. వెలిచాల పంచాయతీ పరిధిలో కిష్టారావుపల్లి, గుడ్డెలుగులపల్లి, ఇందిరానగర్‌ కాలనీలు ఉన్నాయి. ఇంకుడుగుంతల నిర్మాణంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తుండగా, పంచాయతీ పాలకవర్గ సభ్యులు వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఇంటింటికీ నిర్మించుకునేలా చైతన్యవంతుల్ని చేశారు. వెలిచాల గ్రామం ఐఎస్‌ఎల్‌ నిర్మాణాల్లో జనాభాకు అనుగుణంగా ఇప్పటికే వందశాతం పూర్తి చేసుకొని జిల్లాలో ముందు వరుసలో నిలువగా, ప్రస్తుతం ఇంకుడుగుంతల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి వందశాతం పూర్తి చేశారు. ఉపాధిహామీ పథకంలో ఒక్కో ఇంకుడుగుంత నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,400 ప్రోత్సాహకం అందజేస్తున్నది. గ్రామంలో మొత్తం జనాభా 4,513 ఉండగా మహిళలు 2,218, పురుషులు 2,295. గ్రామంలో మొత్తం నివాసాలు 1164 ఉండగా, కమ్యూనిటీ సోపిట్లను కలుపుకొని 1124 ఇంకుడుగుంతలు నిర్మించారు. వానకాలంలో డాబాలు, ఇండ్లపై కురిసే వర్షపు నీరు, ఇండ్లల్లోని, బోర్లు, చేతిపంపుల వద్ద వృథా నీరంతా నేరుగా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో గ్రామంలో ఎక్కడా కూడా మురుగు నీరు నిలిచిన దాఖలాలు లేవు. గ్రామంలో వినూత్నంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అండర్‌గ్రౌండ్‌ మురుగునీటి డ్రైనేజీ ఏర్పాటు చేశారు. గ్రామాన్ని చక్కటి ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ, ఆదర్శంగా తీర్చిదిద్దడంలో గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో పాటు అధికారుల ప్రోత్సాహం ఉందని సర్పంచ్‌ వీర్ల సరోజన పేర్కొన్నారు.