గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jun 10, 2020 , 03:57:24

తెలంగాణ సర్కారే భేష్‌

తెలంగాణ సర్కారే భేష్‌

లాక్‌డౌన్‌ కాలంలో మమ్ముల ఆదుకుంది

n మహారాష్ట్రకంటే తెలంగాణ పథకాలే మంచిగున్నయ్‌

n సీఎం కేసీఆర్‌ మేలు ఎన్నటికీ మర్చిపోలేం

n సరిహద్దు వివాదాస్పద  గ్రామాల ప్రజల అభిప్రాయం

n తెలంగాణ రాష్ట్రంలో ఉండేందుకు ఆసక్తి

కెరమెరి :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం వివాదస్పదంగా మారింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1989లో మొదటిసారిగా సరిహద్దు ప్రాంతంలోని పరందోలి, తాండ, లేండిజాల, కోట, చింతగూడ, శంకర్‌లొద్ది, ముకదాంగూడ, మహరాజ్‌గూడ, అంతపూర్‌, ఏసాపూర్‌, నారాయణగూడ, ఇంద్రనగర్‌, పద్మావతి, బోలపటార్‌, గౌరి, లేండిగూడ గ్రామాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించింది. సుమారు 4 వేలకు పైగా జనాభా ఉన్న ఆ ప్రాంతంలో రెండు రాష్ర్టాల అధికారుల మధ్య కొంత వాదన జరిగింది. దీంతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 1999లో ఆ ప్రాంతంలోని గ్రామాలు ఆంధ్రరాష్ట్ర పరిధిలోకే వస్తాయని తీర్పు వెలువరించగా, దీనిని సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు తమ నివేదికలను కోర్టుకు అందించగా పరిశీలించిన సుప్రీం కోర్టు, తీర్పు ఇచ్చేవరకు ఆ గ్రామాలను రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు సమానంగా పరిపాలించాలని పేర్కొంది. అప్పటి నుంచి నేటి వరకు సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో ఇటు తెలంగాణ, అటూ మహారాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

ఆకట్టుకునేలా తెలంగాణ సర్కారు పథకాలు

అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ ప్రభుత్వాల పాలనను కళ్లారా చూసిన ఈ ప్రాంతవాసులు.. తెలంగాణలో ఉండేందుకు ఆసక్తి చూపిన విషయం విదితమే.టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసింది. పసికందు మొదులుకొని.. పండుటాకుల వరకు ప్రయోజనం చేకూర్చింది. పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, అభాగ్యులకు ఆసరా, నీడలేని వారికి ‘డబుల్‌ బెడ్రూం’, రైతుల కోసం నిరంతర కరెం ట్‌, రైతు బంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, ఇంటింటికీ తాగు నీరందించేందుకు మిషన్‌ భగీరథ, విద్యార్థులకు సన్నబియ్యం.. ఇలా లెక్కకు మించిన పథకాలు అమలు చేస్తుందని, తెలంగాణలోని అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వారు ప్రశంసిస్తున్నారు.

కరోనా కాలంలో కొండంత అండ..

కరోనా వైరస్‌ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌లో తెలంగాణ సర్కారు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు అందించింది. మరోవైపు రెండు నెలల పాటు రూ. 1500 చెల్లించి భరోసానిచ్చింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 కేజీల బియ్యం, 5 కేజీల గోధుమలు, కేజీ శనగ పప్పు మాత్రమే ఇచ్చిందని వారు చెబుతున్నారు.

అన్నితీర్ల ఆదుకుంటున్రు..

సరిహద్దు పల్లె ప్రజలను తెలంగాణ సర్కారోళ్లు అన్నితీర్ల ఆదుకుంటున్రు. రైతులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి ఇస్తున్నరు. ఇదైతే మస్తు మంచిగున్నది. ఆడి పిల్ల పెళ్లికి లక్ష రూపాయలిత్తన్రు. పింఛన్‌ డబ్బులు కూడా ఎక్కువగనే. మహారాష్ట్రలో కంటే తెలంగాణ ప్రభుత్వ పాలన మంచిగుంది. లాక్‌డౌన్‌లో రూపాయి తీసుకోకుండా బియ్యం ఇచ్చిన్రు. పప్పు ఇచ్చిన్రు. ఇంటింటికీ రూ.1500 ఇచ్చిన్రు. ఇది మా అదృష్టం.

- సోనేరావ్‌ కొడపే, బోలాపటార్‌


logo