శనివారం 11 జూలై 2020
Mancherial - Jun 07, 2020 , 02:05:17

ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి

ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి

 ఆరోవిడుత హరితహారం లక్ష్యం 19.9 కోట్లు

  ఆకుపచ్చని మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొనాలి

  అటవీశాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

 అన్ని జిల్లాల అటవీశాఖ    అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌

నిర్మల్‌ అర్బన్‌ : ఈనెల 20న ప్రారంభించనున్న ఆరోవిడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. నిర్మల్‌ జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల అటవీశాఖ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, జిల్లా అటవీశాఖ అధికారులు, ఫారెస్ట్‌ రేంజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, ఇప్పటివరకు నాటిన మొక్కల పరిస్థితిపై జిల్లాల వారీగా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా..  ఐదేండ్లలో ఇప్పటి వరకు 182.74 కోట్ల మొక్కలు నాటామన్నారు.  ఈ మొక్కల్లో ఎన్ని బతికాయని మంత్రి అడిగి తెలుసుకున్నారు.  అటవీ శాఖలో ప్రతి ఉద్యోగీ జవాబుదారీతనంతో పనిచేసి నాటిన ప్రతి మొక్కా బతకాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి హరితహారంలో కోటి చింత మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో అటవీ శాఖ తరఫున సాంకేతిక సహకారం అందిస్తూ మొక్కలు నాటించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాలను సంబంధిత అధికారులకు నిర్దేశించామన్నారు. లాక్‌డౌన్‌తో పర్యావరణం  మెరుగైందని, ఆ ఫలితాలు కొనసాగించేలా అటవీశాఖ పనితీరు ఉండాలని  సూచించారు. కరోనా నేపథ్యంలో హరితస్ఫూర్తిని చాటేలా తెలంగాణకు హరితహారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కులు ధరించాలన్నారు. 100 శాతం లక్ష్యాన్ని జియో ట్యాగింగ్‌తో సహా సాధించాలని ఆదేశించారు. నర్సరీల్లో ఉన్న పెద్ద మొక్కలను మొదటి దశలో నాటాలని, నేల స్వభావానికి తగిన మొక్కలు నాటాలని చెప్పారు. హరితహారం ప్రక్రియను ఆడిట్‌ పరిధిలోకి తేవాలన్నారు. థర్డ్‌ పార్టీ ద్వారా పచ్చదనం పెరిగిన శాతాన్ని సర్వైవల్‌ శాతాన్ని కచ్చితంగా గణించాలని స్పష్టంచేశారు. అడవుల్లో 33 శాతం పచ్చదనం పెంచాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని,  మరోవైపు తునికాకు సేకరణ పురోగతిపై మంత్రి ఆరా తీశారు. వీసీలో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు లోకేశ్‌ జైశ్వాల్‌, ఆర్‌ఎం డోబ్రియల్‌, స్వర్గం శ్రీనివాస్‌, పర్లెయిన్‌, సిదానంద్‌  కుక్రేటి, ఆదిలాబాద్‌ జిల్లా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినోద్‌కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo